బిచ్కుంద, ఏప్రిల్17 : అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్నగర్లో చోటుచేసుకున్నది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హన్మాండ్లు (58), సాయవ్వ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు.
తనకున్న రెండెకరాల్లో పంటల సాగుతో పాటు కూరగాయలు పండిస్తూ ఇద్దరు కూతుళ్ల వివాహం జరిపించారు. ఇటీవల సాగునీటి కోసం అప్పు తెచ్చి మూడు బోర్లు వేయించాడు. మరోవైపు, గతేడాది వడగండ్ల వాన కారణంగా పంట నష్టం వాటిల్లింది. పంట పెట్టుబడులు రాకపోగా, అప్పులు పెరిగి పోవడంతో హన్మాండ్లు మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య సాయవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.