గుడిహత్నూర్, ఫిబ్రవరి 14 : పంటలు సరిగా పండక, అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్రమనస్తాపంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలం గర్కంపేట్కు చెందిన ఉయిక మాధవ్ (52) తనకున్న ఎకరం భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెట్టుబడి కోసం బ్యాంకులో రూ.లక్ష, ఇతరుల వద్ద మరో లక్ష అప్పు చేశాడు. కొన్ని రోజులుగా దిగుబడి సరిగా రావడం లేదు.
అప్పులు ఎలా తీర్చాలన్నా బెంగతో బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. ఈ విషయం భార్యకు చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మహేందర్ తెలిపారు.