యాదగిరిగుట్ట, మే 27: ఎస్వోటీ పోలీసుల అత్యుత్సాహంతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోద దవాఖాన ఐసీయూలో కోమాలో ఉన్నట్టు తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన రైతు దడిగే రాములు బీటీ-3 పత్తి విత్తనాలను విత్తుతున్నారన్న సమాచారంతో భువనగిరికి చెందిన ఎస్వోటీ సిబ్బంది దాడులు జరిపారు. నిషేధిత పత్తి విత్తనాలు కొనుగోలు చయడం నేరమని చెప్పడంతో.. ఆ విషయం తనకు తెలియదని, తెలిస్తే కొనుగోలు చేసేవాడిని కాదని చెప్పినా ఎస్వోటీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో రాములు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వ్యవసాయ బావివద్ద గల పురుగుల మందు తాగారు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని తమ వాహనంలో స్థానిక దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో సికింద్రాబాద్ యశోదకు తరలించారు. ప్రస్తుతం చావుబతుకుల మద్య కొట్టిమిట్టాడుతున్నట్టు సమాచారం.
ఫిర్యాదు చేసేందుకు పడిగాపులు..
ఎస్వోటీ పోలీసులు ఒత్తిడి, భయబ్రాంతులకు గురిచేయడంతోనే రాములు ఆత్మహత్యకు పాల్పడ్డాడరని కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. సాయంత్రం 4 గంటలకు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ను చేరుకుని రాత్రి 10 గంటల వరకు పడిగాపులు కాశామని బాధితుడి తమ్ముడు ఆంజనేయులు, భార్య రాజేశ్వరి తెలిపారు. పోలీసులు ఫిర్యాదు వద్దని, ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని చెప్పారని పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని సముదాయించినట్టు తెలిసింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగారు.