బీబీపేట్(దోమకొండ), మే 3: సాగునీటికోసం భగీరథ ప్రయత్నంచేసిన ఓ యువరైతు అప్పులపాలయ్యాడు. రూ.పది లక్షల దాకా ఖర్చు, పదికి పైగా బోర్లు వేసినా నీటిచుక్క జాడకరువైన తరుణంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్లో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నది. ఎస్సై స్రవంతి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువరైతు పంతులుగారి పెంటయ్య (26)కు రెండెకరాల భూమి ఉంది. పొలంలో నీటి వసతి సరిగా లేకపోవడంతో పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ క్రమంలో పెంటయ్య రెండేళ్లుగా నీటికోసం బోర్లు వేయిస్తూ వస్తున్నాడు. పది బోర్లకు పైగా వేయగా చుక్కనీరు కూడారాలేదు. ఈ రెండేండ్లలో రూ.10 లక్షల దాకా అప్పుల పాలయ్యాడు. ఎంత ప్రయత్నించినా నీళ్లు రాకపోవడం, అప్పులు మీదపడటంతో పెంటయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పు తీర్చేమార్గం కనిపించకపోవడంతో శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే చీరతో ఉరేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. తల్లి మణెవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.