సైదాపూర్, అక్టోబర్ 11: దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జులపల్లిలో చోటుచేసుకున్నది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు పూదరి శ్రీనివాస్ (40) తనకున్న మూడెకరాల్లో ఎవుసం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఆశించిన మేర దిగుబడులు రాకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఈనెల 9న తన పొలం వద్ద పురుగుల మందు తాగగా, రైతులు, కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం 10న వరంగల్ ఎంజీఎంకు తరలించగా శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.