జగదేవపూర్, ఆగస్టు 1 : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తీగుల్కు చెందిన బునారి నరేందర్(34) తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎకరం పొలంలో వరినాటు వేయగా, మరో ఎకరన్నర కౌలుకు తీసుకొని పత్తి సాగుచేస్తున్నాడు. ఖాళీ సమయంలో హమాలీ పనులు చేస్తుంటాడు. కుటుంబ ఖర్చులు, పంటల పెట్టుబడి కోసం అప్పు చేశాడు. ఇటీవల 8 గుంటల భూమిని విక్రయించినా అప్పు తీరలేదు. చీటీ డబ్బులు కట్టేందుకు ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో మనస్తాపం చెందిన నరేందర్ శుక్రవారం ఉదయం పది గంటలకు తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.