నంగునూరు, జనవరి 11: పెట్టుబడి భారమై, అ ప్పులు తీర్చే మా ర్గంలేక మనస్తాపం తో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్‌లో చోటుచేసుకున్నది. రాజగోపాల్‌పేట ఎస్సై వివేక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్‌కు చెందిన ఎల్ల రాజిరెడ్డి (50) వ్యవసాయంతో పాటు ఎడ్ల వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టం రావ డం, సాగు కోసం వేసిన రెండు బోర్లు విఫలం కావడంతో రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన రాజిరెడ్డి, ఈ నెల 10న ఇంట్లో గడ్డిమందు తాగారు. ఆయనను హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధి కరువై.. చేనేత కార్మికుడి ఆత్మహత్య ; జనగామ జిల్లా బచ్చన్నపేటలో విషాదం
బచ్చన్నపేట, జనవరి 11: ఉపాధి లేక చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన చిట్టిమల్ల లావణ్య-శివకృష్ణ దంపతులు స్వగ్రామంలో ఉపాధిలేకపోవడంతో బచ్చన్నపేటలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. చేనేత పనులు లేకపోవడం, ఉపాధిమార్గంలేక బతకడమెలా అని శివకృష్ణ (43) భార్యతో తరచూ చెబుతూ బాధపడేవాడు. ఈ క్రమం లో ఆదివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో చీరెతో ఉరేసుకొన్నాడు. చేనేత వృత్తిలో ఉపాధి లేక, కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగాలేక తన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.