ఇది ఓ కౌలురైతు ఇంట కన్నీటిగాథ. మ్యాక శ్రీనివాస్ ఏడెకరాల భూమి కౌలుకు చేస్తే, రూ.8 లక్షల అప్పయింది. సాగునీటి కష్టాలు, పంట దిగుబడి నష్టాలతో ఒక కారు, అధిక వర్షాలతో పంటంతా పోయి ఇంకో కారు ఆ కౌలు రైతుకు నష్టాలే మిగిలాయి. ఇక ఆ అప్పు తీర్చేదారి కనిపించలేదు. సర్కారు సాయంచేసే కనికరం చూపలేదు. ఇక చావే దిక్కనుకున్నాడు. నిరుడు డిసెంబర్లో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ రూ.8 లక్షల అప్పు మిగిలే ఉన్నది. పిల్లలను సాకేందుకు కూలిపనులకు పోతుంది. అప్పు తీర్చేదెలా? అని ఆయన పోయినప్పటి నుంచి నిత్యం మదనపడుతూ నరకయాతన అనుభవిస్తున్నది.
కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన మ్యాక శ్రీనివాస్ లారీ డ్రైవర్. ఆయనకు భార్య లత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పదేండ్లపాటు లారీ నడుపుతూ జీవనం సాగించిన ఆయన వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి పేరిట ఉన్న కొద్దిపాటి భూమిని ముగ్గురు సోదరులు పంచుకోవాల్సి ఉన్నది. ఈ దశలో కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్ ఎకరానికి రూ.30 వేల చొప్పున ఏడు ఎకరాలకు రూ.2.10 లక్షలు చెల్లించి కౌలుకు తీసుకున్నాడు.
ఈ భూమిలో సాగుచేసిన పంట ఒక సీజన్లో నీటి సదుపాయం లేక ఆశించినంతగా దిగుబడి రాలేదు. వచ్చిన దిగుబడిలో పెట్టుబడి కూడా చేతికి రాలేదు. ఆ సీజన్లో కౌలు మీద పడింది. మరో సీజన్లోనైనా పంట వస్తుందని ఆశించి మరింత అప్పుచేసి మరో ఏడాది అంతే భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఈ సీజన్లో అధిక వర్షాలతో పంట దెబ్బతిన్నది. ఇంకో పంట వేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. అప్పటికే రూ.8 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. వీటిని తీర్చే దారి కనిపించక శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెంది నిరుడు డిసెంబర్ 22న తన ఇంటి వెనుకాలే విషం తాగి ఆత్మహత్య చేసుకన్నాడు.
ఇద్దరు ఆడపిల్లలను చక్కగా చదివించి వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్న శ్రీనివాస్, లత ఆశలన్నీ ఆ ఇంటి పెద్ద మరణంతో ఆవిరయ్యాయి. పెద్దమ్మాయి ఇప్పుడు హుజూరాబాద్‌లోని ఓ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. చిన్న కూతురు మూడో తరగతి చదువుతున్నది. వీళ్ల పోషణకు లత పడరాని పాట్లు పడుతున్నది. అత్తామామలు కట్టిన ఇంటిలో తమ వాటా కింద ఇంత చోటిచ్చినా లతకు బతుకుదెరువు మాత్రం లేదు. ఆమె ఊరిలో దొరికే కూలిపనులకు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నది. మామ రాజయ్య ఇచ్చిన 20 గుంటల భూమిలో పంట తీసుకుంటున్నది. కానీ, అది పిల్లల పోషణకు ఏ మాత్రం సరిపోవడంలేదు. శ్రీనివాస్ పేరిట కనీసం కొంత భూమి ఉన్నా ఆమెకు రైతు బీమా కింద రూ.5 లక్షలు వచ్చేవి. శ్రీనివాస్ మరణంతో ఇంత దీనస్థితికి చేరిన ఈ కుటుంబానికి ఇప్పటికీ రూ.8 లక్షల అప్పు అలాగే ఉన్నది.
‘నా భర్త మరణంతో మా ఇల్లు ఆగమైంది. ఇద్దరు ఆడ పిల్లలు. కూలినాలీ చేసుకొని వాళ్లను పోషించుకుంటున్న. ఆయన పేరిట భూమి లేదని రైతుబీమా సుతం రాలేదు. చేసిన అప్పు రూ.8 లక్షలు ఇంకా అట్లనే ఉంది. ఏంచేసి తీర్చాలో అర్థంమైతలేదు” అంటూ ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు శ్రీనివాస్ భార్య లత ఆందోళన వ్యక్తంచేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్లో మ్యాక శ్రీనివాస్ ఒకరు. ప్రభుత్వం కనీసం సాయం చేయాలనే ఆలోచనే చేయలేదు. కనీసం అధికార పార్టీ నాయకులు కూడా పరామర్శించింది లేదు. ప్రభుత్వ పరంగా కనీసం విచారణనైనా చేయనేలేదు. ఈ పరిణామాలు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు శాపాలుగా మారుతున్నాయి. శ్రీనివాస్ మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని, ఇద్దరు ఆడపిల్లలను చదివించేందుకు ఆయన భార్య లత పడుతున్న కష్టం వర్ణనాతీతం అని స్థానికులు సానుభూతి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.