హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : పారాక్వాట్ గడ్డి మందును నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. విషపూరితమైన పారాక్వాట్‌తో వందలాది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మందును నిషేధించాలని ఐఎంఏ, రైతు సంఘాల నేతలు రైతు కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. రాష్ట్రంతోపాటు దేశంలోనూ దీని నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని రైతు కమిషన్ కోరింది.
మంగళవారం రైతు కమిషన్ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. అమెజాన్‌లో ఈ మందు అందుబాటులో ఉండడంపై కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మందును ఎలా సప్లయ్ చేస్తుందని ప్రశ్నించారు. ఈ విషయంపై అమెజాన్‌కు నోటీసులివ్వాలని రైతు కమిషన్ అధికారులను ఆదేశించింది.