రేగొండ, మే 23 : వ్యవసాయ క్షేత్రంలో గడ్డిని తగులబెడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రైతు సజీవ దహనం కాగా.. పొగతో ఊపిరాడక ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లెలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. రైతు చాగర్ల చంద్రమొగిలి (63), భార్య భాగ్య(60), కుమారుడు భాస్కర్, కోడలు రమ కలిసి శనివారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. కొత్తగా తవ్విన బావికి ఓడలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రమొగిలి ఇటీవల తన పొలంలో కోసిన వరిగడ్డిని తగులబెడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరోరైతు పొలంలోని గడ్డికి అంటుకున్నాయి. మంటలను ఆర్పేందుకు చంద్రమొగిలి ప్రయత్నించగా అందులోనే చిక్కుకుని సజీవదహనమయ్యాడు. పక్కన ఉన్నవారు అతనిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే అగ్నికి ఆహుతి అయ్యాడు. కాగా, ఆయన భార్య భాగ్య పొగకు ఊపిరాడక సృహతప్పిపడిపోయింది. వెంటనే ఆమెను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మె ల్యే గండ్ర సత్యనారాయణరావు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సదరు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.