మంచిర్యాల : రైతుల కష్టాలు అన్ని, ఇన్నీ కావు. నారు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు ఒక ఇబ్బంది అయితే పండించిన పంటను అమ్మేందుకు మరో సమస్య. కాంగ్రెస్ ( Congress ) పాలనలో రైతుల దైన్యస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. రైతు డిక్లరేషన్ ( Farmers Declaration ) పేరిట అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ నేడు పట్టించుకోక పోవడంతో రైతులు రోడ్డు పాలవుతున్నారు. కనబడ్డ ప్రతి అధికారి కాళ్లు మొక్కుతూ తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బతిమిలాడుతున్నారు.
శుక్రవారం మంచిర్యాల( Mancheriyal ) జిల్లా హాజీపూర్ మండలంలోని రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. అక్కడకు వచ్చిన జాయింట్ కలెక్టర్ ( Joint Collector ) కాళ్ల మీద పడి ధాన్యం కొనుగోలు చేయాలని ఓ రైతు వేడుకోవడం రైతన్నల అధ్వాన్న పరిస్థితిని చాటి చెబుతుంది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టాలపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.