సాక్షాత్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు చుక్కనీరు కూడా అందక పంటలన్నీ చేతికిరాకుండా పోతున్నాయి. మోతె, నడిగూడెం, మునగాల ఈ మూడు మండలాల పరిధిలోనే 42 వేల ఎకరాల్లో పంటలు వేస్తే ఏకంగా 38 వేల ఎకరాలు ఎండిపోయాయి. పొక్కిలిలా మారిన తన పొలాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మోతె మండలం లాల్‌తండాకు చెందిన రైతు బానోతు వీరన్న.
సాగు నీరు లేక పంటలు ఎండుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. వెల్దండలోని దేవాదుల రిజర్వాయర్ తూముకు నీళ్లు అందకపోవడంతో కాల్వను తీసేందుకు శనివారం రైతులు జేసీబీ సాయంతో వెళ్లారు. ఈ క్రమంలో అధికారులు ఫోన్లు చేసి నీటిని తరలిస్తే కేసులు పెడుతామని హెచ్చరించడంతో రిజర్వాయర్ వద్ద నిరసన తెలిపారు. అధికారుల తీరుపై మండిపడ్డారు.
– నర్మెట
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు తానికుంట పక్కన ఉన్న వ్యవసాయ బావుల్లో నీటి ఊట కన్పించడం లేదు. రైతు దొంగల మొగిళి కూలీలను పెట్టి క్రేన్ సహాయంతో తన వ్యవసాయబావిని తవ్విస్తున్నాడు. ఇంతకు ముందు 10 కోలల వరకు లోతు ఉండగా మరో నాలుగు కోలలు తవ్వినా ప్రయోజనంలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.
– భీమదేవరపల్లి
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో సాగునీటి ఇక్కట్లు తీవ్రమయ్యాయి. దుబ్బాక గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్‌రెడ్డి ఐదెకరాల్లో వరి వేశాడు. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు ఆగి ఆగిపోయడంతో ఇటీవల సగం ఎండిపోయింది. మిగిలిన సగమైనా చేతికొస్తుందనుకున్న రైతు ఆశలు అడియాసలయ్యాయి. బోర్ల నుంచి చుక్కనీరు రాకపోవడం మొత్తం పంట ఎండిపోయింది. ఆదాయం రాకపోవడమేగాక సాగు ఖర్చులు మీద పడ్డాయని శ్రీకాంత్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు.
– ధర్పల్లి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గిన్నేరా గ్రామ పంచాయతీ పరిధిలో గల తోయగూడ గ్రామానికి చెందిన ఆదివాసీలు బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తున్నది. ఎండల తీవ్రతకు తోయగూడ గ్రామంలోని చేతిపంపులు, కొలాంగూడకు చెందిన బోరు అడుగంటిపోయాయి. ఉదయం, సాయంత్రం చుట్టుపక్కల గ్రామాల నుంచి నీటిని తీసుకొచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని తోయగూడ వాసులు కోరుతున్నారు.
-ఇంద్రవెల్లి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్గల్ మామిడి మార్కెట్ వద్ద రైతులు రోడ్డెక్కారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు మామిడి కాయలను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చివరికి కిలో మామిడికి రూ.64 చెల్లిస్తామని వ్యాపారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
– జగిత్యాల టౌన్
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కాశేగుడిసెల గ్రామానికి చెందిన షేక్ కమల్ తనకున్న రెండెకరాల వరిపొలం ఎండిపోతుండటంతో ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నాడు. పంట చేతికి వచ్చే దశలో ఉన్నందున్న ఒక్కో ట్యాంకర్‌కు రూ.1500 చెల్లించి రోజువారీగా నాలుగు ట్యాంకర్లు తెచ్చి పొలం పారించుకుంటున్నాడు. గతంలో ఇలాంటి పరిస్ధితిని చూడలేదని రైతు కమల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
– చేర్యాల