భువనగిరి కలెక్టరేట్ జూలై 7 : ప్రజావాణిలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం యాదాద్రిభువనగిరి కలెక్టరేట్లో చోటుచేసుకుంది. బాధితుడు తడకపల్లి ఆగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం .. 2005లో బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లిలో చీమల లింగంకు చెందిన 1.32 ఎకరాల భూమిని కొనుగోలుచేశాడు. ఆ భూమిని రెవెన్యూ అధికారులు గ్రామానికి చెందిన సింగిరెడ్డి మహిపాల్‌రెడ్డిపై రికార్డుల్లో నమోదుచేసినట్టు తెలుసుకున్న ఆగిరెడ్డి కొన్నేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. విసిగిపోయిన ఆగిరెడ్డి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణిలో తనకు జరిగిన అన్యాయంపై మొరపెట్టుకున్నాడు. తహసీల్దార్, రెవెన్యూ అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతూ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసు సిబ్బంది ఆగిరెడ్డిని అడ్డుకున్నారు. స్పందించిన కలెక్టర్ అధికారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.