దేవరకద్ర, జనవరి 20 : ‘నా పట్టా భూమిలో అక్రమంగా బాట వేస్తున్నారు.. అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారు.. అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదు’ అని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు కథనం మేరకు.. దేవరకద్ర మండలం చౌదర్‌పల్లికి చెందిన రైతు కంపిలి రామకృష్ణకు గ్రామ శివారులో సర్వే నంబర్ 88లో ఆరెకరాల 6 గుంటల పట్టా భూమి ఉన్నది.
పైనున్న పొలాలకు వెళ్లేందుకు బాట కావాలని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు.. రైతు రామకృష్ణ అనుమతి లేకుండానే గతంలో మట్టితో రోడ్డు వేసేందుకు యత్నించగా అడ్డుకొన్నాడు. దీంతో వారు అతడిపై దాడి చేశారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. సోమవారం బాట కోసం మళ్లీ మట్టి వేస్తుండగా.. రామకృష్ణ, అతడి భార్య అరుణ అడ్డుకునేందుకు వెళ్లగా దాడి చేశారు.
న్యాయం కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. దీంతో మనస్తాపం చెందిన రైతు తన వెంట తెచ్చుకొన్న పెట్రోల్‌ను తహసీల్దార్ కార్యాలయంలోనే ఒంటిపై పోసుకున్నాడు. అక్కడున్న వారు అడ్డుకొని పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. స్పందించిన తహసీల్దార్ కృష్ణయ్య రైతు నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతు శాంతించాడు.