Samagra Survey | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులాలవారీగా కుటుంబ సర్వేపై సందిగ్ధత నెలకొన్నది. ఈ సర్వేలో ప్రధానమైన కులగణనతోపాటు 75 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇప్పటివరకు తెల్లరేషన్ కార్డు, ఆసరా పింఛన్, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు పొందుతున్నవారు, భవిష్యత్తులో పొందేబోయేవారు సర్వే నివేదిక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రణాళిక, గణాంకశాఖ నేతృత్వంలో 60 రోజుల్లో సర్వే పూర్తిచేయాలని నిరుడు అక్టోబర్ 14న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సర్వే నిర్వహణ కోసం రూ.150 కోట్లు విడుదల చేశారు. నేటికీ 80 రోజులైనా కుటుంబ సర్వే ఏమైంది? గ్రామాల్లో ఎంత వరకు పూర్తయింది? జీహెచ్ఎంసీ పరిధిలో ఎంత వరకు జరిగింది? కులాలవారీగా జనాభా ఎంత? కంప్యూటరీకరణ ఎంతవరకు వచ్చింది? ప్రభుత్వానికి సర్వే నివేదిక సమర్పించారా? లేదా అనే వివరాలను అధికారికంగా వెల్లడించనే లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 95 నుంచి 98% వరకు, కొన్ని గ్రామాల్లో 100% మేర పూర్తయినట్టు, జీహెచ్ఎంసీలో 20% కూడా దాటలేదని రాష్ట్ర ప్రణాళిక, గణాంకశాఖ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. 94 వేల మంది ఎన్యుమరేటర్లు, 9 వేల మంది సూపర్వైజర్లు సర్వే ప్రక్రియలో పాలుపంచుకున్నారు.
పూర్తయిన డాటా ఎంట్రీ
సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని రాష్ట్ర ప్రణాళిక, గణాంకశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. సర్వే గురించి వివరణ కోరగా.. సర్వే డాటా ఎంట్రీ పూర్తయిందని, రిపోర్టు ఫైనల్ స్టేజ్లో ఉన్నదని, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి నివేదిక అందలేదని సెస్ వర్గాలు తేల్చిచెప్పడం గమనార్హం.
1931లోనే కులగణన
బ్రిటీష్ ఇండియా కాలంలో 1881లోనే జనగణన మొదలైంది. పదేండ్లకోసారి క్రమం తప్పకుండా జరిగేది. దానినే తెలంగాణలో నిజాం సర్కారు అమలుచేసింది. ఈ క్రమంలో 1911లో అంటరాని కులాలను ఒక ప్రత్యేక క్యాటగిరీ కింద నమోదు చేశారు. బ్రిటీష్ పాలనలో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి ఉన్న ఉమ్మడి భారతదేశంలో 1931లో మొదటిసారి కులగణన జరిపారు. కులాలు, మతాల వారీగా లెక్కలు నమోదుచేశారు. వీటికి అనేక పరిమితులున్నా, ఇప్పటివరకు ఆ లెక్కలే మనకు దిక్కయ్యాయి. నాడు 44 హిందూ కులాలను, రెండు ఆది హిందూ కులాలను, ఆరు ఆదివాసీ తెగలను నమోదు చేశారు. ఉపకులాలను నమోదు చేయనేలేదు. కులగణనతోపాటు ప్రజల జీవన విధానం, అక్షరాస్యత, జీవనోపాధి, ఉద్యోగాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలను పొందుపర్చారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా కులాలవారీగా సమగ్రంగా, అధికారికంగా గణన చేపట్టలేదు. స్వాతంత్య్రానంతరం పలువురు ముఖ్యమంత్రులు అధికారికంగా, అనధికారికంగా కులాల లెక్కలు, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా తీసినా వాటిని ఎవరూ వెల్లడించలేదు.
సమాజ స్థితిగతులు తెలుసుకోవడానికి 76 ఏండ్లు
దేశంలో, రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితి తెలుసుకొంటే వారి అవసరాలు, అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలోనే ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కారు తొలుత బీసీ జనగణన చేయాలని భావించింది. బీసీ సంఘాల నేతల డిమాండ్ మేరకు అన్ని కులాల జనగణన తలపెట్టారు. బీసీ జనగణన జరిపితే అశాస్త్రీయం, పాక్షికం అవుతుందని, అన్నికులాల, వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలతో సమగ్ర కుటుంబ గణన నిర్వహించడం వల్ల సమాజ స్థితిగతులు కొంచమైనా అర్ధమవుతాయని ఆయా సంఘాల నేతలు చెప్పారు. ఆయా వర్గాల జనాభాకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిన్న విషయం అర్థం కావడానికి కాంగ్రెస్ పార్టీ నేతలకు, పాలకులకు 76 ఏండ్లు పట్టింది.