గురువారం 09 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:51:27

విసిగి.. వేసారి

విసిగి.. వేసారి

  • అధికారుల తీరుతో బాధితుల ఆత్మహత్యాయత్నం
  • భూవివాదాలు పరిష్కరించాలని వేర్వేరు చోట్ల నిరసనలు

ఆత్మకూర్‌(ఎస్‌)/కాల్వశ్రీరాంపూర్‌/సూర్యాపేట సిటీ: భూవివాదాలను పరిష్కరించాలని కోరుతూ వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆన్‌లైన్‌లో తన భూమిని తొలగించారని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏపూరుకు చెందిన గున్న పద్మ మంగళవారం స్థానిక తాసిల్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన క్ర మంలో సొమ్మసిల్లి పడిపోయింది. గ్రామంలోని సర్వే నంబర్‌ 239లో పద్మకు 3.10 ఎకరాల భూమి ఉన్నది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత 2.31 ఎకరాలు మాత్రమే కొత్త పట్టాదారు పాస్‌పుస్తకంలో నమోదు చేశారు. మిగిలిన 19 గుం టల భూమిని పాస్‌బుక్కులో ఎక్కించాలని పద్మ తాసిల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో కోర్టుకెళ్లి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఉన్న భూమిని సైతం ఆన్‌లైన్‌లో నుంచి తీసేశారు. దీంతో బాధితురాలు మంగళవారం తాసిల్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 5 గంటలపాటు నిరసన తెలిపినా అధికారులు స్పందించలేదు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు గమనించి దవాఖాన కు తరలించారు. మరో ఘటనలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఇప్పలపల్లికి చెం దిన సతీష్‌ తండ్రి రాజయ్య పేరిట ఎకరం భూమి ఉన్నది. అందులో 8 గుంటల భూమిని అధికారులు అక్రమంగా మరొకరి పేరిట పట్టాచేశారని, తన పేరిట పట్టా చేయాలని రెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సతీష్‌ వాపోయాడు. అధికారుల తీరుతో విసిగిపోయి మంగళవారం పెట్రోల్‌ బాటిల్‌తో గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తాసిల్దార్‌ సునీత  హామీ ఇవ్వడంతో కిందికి దిగివచ్చాడు. 

ఎస్సై అన్యాయం చేస్తున్నాడని..

భూవివాదంలో ఎస్సై తమకు అన్యాయం చేస్తున్నాడని ఓ కుటుంబం సూర్యాపేట ఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మోతెకు చెందిన పల్లెల లక్ష్మణ్‌, రాములు కుటుంబానికి స్థానికంగా 150 గజాల ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం ఉన్నది. అక్కడ ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో నాగయ్య అనే వ్యక్తి అడ్డుపడ్డాడు. వారిమధ్య గొడవ జరగ్గా పల్లెల లక్ష్మణ్‌, రాములు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై గోవర్ధన్‌ వీరి ప్రత్యర్థికి అనుకూలంగా మాట్లాడుతున్నాడని బాధితులు ఆరోపించారు. మంగళవారం కుటుంబంతో వచ్చి ఎస్పీ భాస్కరన్‌ను కలిసి విన్నవించగా ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా వారు విశ్వసించక జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో పెట్రోల్‌ పోసుకునేందుకు యత్నించారు. పోలీసులు నిలువరించడంతో ప్రమాదం తప్పింది.logo