నేరేడుచర్ల, మే 17: బంగారం, డబ్బు కోసం చివరికి చనిపోయిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా రెండు రోజులు ఫ్రీజర్‌లో ఉంచి మూడోరోజు ఆస్తి పంపకాలు ముగిసిన తర్వాతే కర్మకాండలు పూర్తి చేశారు. అత్యంత హేయమైన ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో జరిగింది.
గ్రామానికి చెందిన వేము వెంకట్‌రెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. గతంలోనే భర్త వెంకట్‌రెడ్డితోపాటు చిన్న కుమారుడు నారాయణరెడ్డి చనిపోయారు. దాంతో లక్ష్మమ్మ నేరేడుచర్లలో చిన్న కుమా ర్తె వెంకటమ్మ వద్దే ఐదేండ్లుగా ఉంటున్నది. లక్ష్మ మ్మ ఇటీవల ఇంట్లో కాలుజారి పడగా, మిర్యాలగూడ దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు తెలపడం తో, ఈ నెల 15 రాత్రి 9 గంటలకు చిన్న కూతురు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్లింది.
ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు సైదిరెడ్డి అక్కడికి చేరుకుని పంచాయితీ పెట్టాడు. అమ్మను కందులవారిగూడెం తీసుకువెళ్తానని చెప్పడంతో మిగిలిన కుటుంబ సభ్యులు ఆస్తి పంపకాలు తేలేవరకు అంబులెన్స్ కదిలేది లేదని పట్టుబట్టారు. ఇదంతా జరుగుతుండగానే రాత్రి 11 గంటలకు లక్ష్మమ్మ కన్నుమూశారు. భౌతికకాయాన్ని అదే అంబులెన్స్‌లో కందులవారిగూడేనికి తరలించారు. అయినా కొడు కు, కూతుళ్ల మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉన్నది. లక్ష్మమ్మ గతంలో రూ.21 లక్షల వరకు పలువురికి అప్పుగా ఇచ్చింది.
ఆమె ఒంటిపైన 20 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వైద్య ఖర్చులు భరించిన చిన్న కూతురికి రూ.6 లక్షలు ఇవ్వగా, మిగిలిన రూ.15 లక్షలకు సంబంధించిన పత్రాలను కొడుకుకు అప్పజెప్పారు. ఆభరణాలను ముగ్గురు కూతుళ్లు పంచుకున్నారు. అంతా అయిపోయిందిలే అనుకుంటుండగా, కొడుకు కొత్త పేచి పెట్టా డు. అంత్యక్రియల ఖర్చులు భరించలేనని, ఖర్చుల డబ్బులిస్తేనే తలకొరివి పెడుతానని చెప్పడంతో కర్మకాండలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు పంచాయితీని పరిష్కరించడంతో దహన సంస్కారాలు పూర్తి చేశారు. అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.2 లక్షల వరకు కుటుంబ సభ్యులు ఇస్తున్నట్టు సమాచారం.