భిక్కనూరు, మార్చి 14: గూగుల్ మ్యాప్ ఆధారంగా కారులో ప్రయాణించిన ఓ కుటుంబం ప్రమాదం బారినపడింది. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరులో చోటుచేసుకున్నది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన ఓ కుటుంబం శుక్రవారం వేకువజామున ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతి ఆలయానికి కారులో బయల్దేరింది. వారు గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్తుండగా మార్గమధ్యంలో భిక్కనూరు మండలం 44వ జాతీయ రహదారి మీదుగా కాకుండా తహసీల్ ఆఫీస్ నుంచి లొకేషన్ చూపించింది. దీంతో వారు ఆ మార్గం గుండా వెళ్లారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉండటంతో కారు రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లగా.. బురదలో చిక్కుకొని అక్కడే ఆగిపోయింది. కారులో ఉన్న వారు 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి కాలువలోకి దూసుకెళ్లిన కారును జేసీబీ సాయంతో బయటికి తీయించారు.