KTR | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : సవాలక్ష వివాదాలతో సుప్రీంకోర్టులో కేసులున్న భూమిపై.. అదీ ప్రభుత్వంతో సంబంధం లేని, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమిపై క్విడ్‌ప్రోకో (ఇచ్చి పుచ్చుకోవడం) సాధ్యమవుతుందా? కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుకూల పత్రికలు దీన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్‌పై బురదజల్లడమే లక్ష్యంగా రోజుకో రకం కథనాలను వండి వారుస్తున్నాయి. ఫార్ములా-ఈ కార్ రేస్‌లో హైటెక్ సిటీలోని వివాదాస్పద భూములకు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగినట్టు తప్పుడు ప్రచారానికి తెరతీశాయి.
ఇందుకు సంబంధించి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి అనుకూల పత్రిక ఓ విష కథనాన్ని వడ్డించింది. ఆ కథనంలోనే సదరు పత్రిక పలు కీలక అంశాలు కూడా వెల్లడించింది. ఈ భూమి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులదని తేల్చింది. దీని కోసం ఐదారు హౌసింగ్ సొసైటీలు, ఓ సంస్థ కూడా కొట్లాడుతున్నట్టు పేర్కొన్నది. దీనిపై కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా కేసులున్నట్టు పేర్కొన్నది. ఇన్ని రకాల ఇబ్బందులున్న భూముల్లో మళ్లీ కేటీఆర్ ఒక సంస్థకు మేలు చేసేలా క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపణలు చేసింది. ఓ వైపు క్విడ్ ప్రోకోకు అవకాశం లేదని చెప్తూనే మరోవైపు కేటీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రైవేటు సంస్థల ఒప్పందంతో కేటీఆర్‌కు ఏం సంబంధం?
హైటెక్ సిటీ సమీపంలోని 1007 సర్వే నంబర్లో 240 ఎకరాల వివాదాస్పద భూమి ఉన్నది. ఈ భూమి తమదంటే తమదంటూ పలువురు వ్యక్తులు, సంస్థల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. పలువురు ముస్లింలు ఈ భూమి తమదని వాదిస్తుంటే.. ఐదారు హౌసింగ్ సొసైటీలు తమదని వాదిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రైమ్ ప్రాపర్టీస్ అనే సంస్థ ఈ భూమి తమదని, దీన్ని తాము కొనుగోలు చేశామని చెప్తున్నది. ఈ సంస్థతో గ్రీన్ కో సంస్థ ఒప్పందం చేసుకున్నది. ఈ భూ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నది. ఇంకా తీర్పు రాలేదు. ప్రస్తుతం ఈ భూమిపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ భూమి తమదని వాదిస్తున్న ప్రైమ్ ప్రాపర్టీస్ సంస్థ సదరు భూమిని జాయింట్ డెవలప్మెంట్ కోసం గ్రీన్కో సంస్థతో ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం కేటీఆర్ వల్లే అయ్యిందంటూ సదరు పత్రిక ఆరోపించింది.
ఫార్ములా-ఈ కార్ రేసులో గ్రీన్కో కంపెనీకి అనుబంధంగా ఉన్న సంస్థ భాగస్వామిగా ఉండటంతో ఆ పత్రిక ఇలా ఆరోపణలకు పూనుకున్నట్టు తెలుస్తున్నది. సదరు గ్రీన్కో కంపెనీ ఒక వ్యాపార సంస్థగా ప్రైవేట్ ప్రాపర్టీస్‌తో ఒప్పందం చేసుకున్నది. ఇది రెండు ప్రైవేట్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! దీన్ని బోడిగుండుకు, మోకాలికి లింకు పెట్టినట్టుగా ఫార్ములా ఈ కేసుకు, భూములకు లింకు పెట్టి కేటీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. రెండు ప్రైవేట్ సంస్థల మధ్య ఒప్పందం జరిగితే దానితో కేటీఆర్‌కు ఏం సంబంధమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సదరు పత్రిక కూడా ఎక్కడా నిర్దిష్టమైన ఆధారాలతో కథనం రాయలేదు. ఆరోపణలు, అభాండాలతోనే కథనాన్ని వం డి వార్చినట్టు స్పష్టమవుతున్నది. ఇది కేవ లం కేటీఆర్‌పై బురదజల్లేందుకే తప్ప మరోటి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మనీలాండరింగ్..ఎలక్టోరల్ బాండ్లు.. భూములు
ఫార్ములా ఈ రేస్ కేసులో పసలేక పోవడంతో రేవంత్ సర్కార్ రోజుకో దుష్ప్రచారం చేస్తున్నది. 55 కోట్ల రూపాయల ఒప్పందాన్ని అమాంతం 600 కోట్లకు పెంచింది. ఇందులో కేటీఆర్‌కు విదేశీ కంపెనీ నిధులు మళ్లించిందని తొలుత ఆరోపణలు చేసింది. కానీ ఎలాంటి ఆధారాలనూ చూపలేదు. దీంతో గ్రీన్ కో సంస్థ ఎలక్టోరల్ బాండ్లను బీఆర్ఎస్కు ఇచ్చిందని, అందుకే ఆ సంస్థకు ఫార్ములా ఈ రేసు నిర్వహణ బాధ్యతలు అప్పగించారని ప్రచా రం చేసింది.
ఈ వాదనలోనూ పసలేదని తేలిపోయింది. గ్రీన్ కో కాంగ్రెస్ పార్టీకి కూడా భారీగా ఎన్నికల నిధులను సమకూర్చింది. దీంతో ఏం చెయ్యాలో తోచని రేవంత్‌రెడ్డి, తన అనుకూల మీడియా ద్వారా కేటీఆర్‌పై తప్పుడు ప్రచారానికి దిగారనే వాదనలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌కు సంబంధమే లేని అంశాలను తెరమీదికి తెచ్చి ప్రజల్లో అయోమయం సృష్టించాలన్న ఆలోచనతోనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేసు కేసులో పసలేక.. భూముల కుట్ర!
కేటీఆర్‌ను ఎలాగైనా జైలుకు పంపించాలనే పతంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్ కేసును పావుగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ కేసులో పస లేదని గ్రహించి, ఇప్పుడు కొత్త కుట్రకు తెరలేపారన్న విమర్శలు వస్తున్నాయి. అసలు సంబంధమే లేని ఫార్ములా-ఈ కార్ రేసుకు హైటెక్ సిటీ భూములకు లంకె పెట్టడం కుట్రలో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ-కార్ రేసు కేసు వీగిపోతే దీనికి హైటెక్ సిటీ భూములను లింకు చేయడం ద్వారా కేసును మరో కోణంలో తిప్పాలనే కుట్ర చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.