ఖమ్మం, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సూర్యాపేట, (నమస్తే తెలంగాణ): రైతన్నపై నకిలీ విత్తనాల కత్తి వేలాడుతున్నది. ఈ సారి కూడా నకిలీ పత్తి విత్తనాల దందాకు తెరలేచింది. ఫలితంగా రైతులు నిండా మునిగే ప్రమాదం కనిపిస్తున్నది. ఇప్పటికే పొరుగు రాష్ర్టాల నుంచి లక్షలాది నాసిరకం ప్యాకెట్లు జిల్లాకు చేరాయి. దళారులు యథేచ్ఛగా గ్రామాల్లో తిరుగుతూ దగా చేస్తున్నారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో నకిలీ విత్తన విక్రయాల బెడద ఏటా పెరుగుతున్నది. సీజన్ మొదట్లోనే విక్రయదారులు గ్రామాల్లో పర్యటించి రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడం, ఫలితంగా అప్పులు తీర్చే మార్గం కన్పించకపోవడం వంటి కారణాలతో బలవన్మరణాలనే మార్గంగా ఎంచుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఇటీవల పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏన్కూరుకు చెందిన గాజుల నర్సింహారావు, పోలేటి కోటేశ్వరరావు, అదే మండలంలోని రేపల్లెవాడకు చెందిన వెనిగండ్ల శ్రీనివాసరావు కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని మైలవరం, బాపట్ల, తెనాలి ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఏన్కూరు ప్రాంతంలో రైతులకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గత నెల 28న టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ అధికారులతో కలిసి నకిలీ విత్తనాల విక్రేతల ఇండ్లపై దాడులు చేశారు. ఆ సమయంలో వారి వద్ద నుంచి రూ.14 లక్షల విలువైన 560 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సూర్యాపేట జిల్లాలో విచ్ఛలవిడిగా నకిలీ పత్తి విత్తనాలు దొరుకుతున్నాయి. దిగుబడి బాగా వస్తుందని రైతులకు తక్కువ ధరకు అంటగడుతున్నారు. ఇటీవల పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు తిరుమలగిరి మండలంలో రూ.4.62 లక్షల విలువ చేసే 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మోతె, ఆత్మకూర్.ఎస్ మండలాల పరిధిలో రూ.65 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ లెక్కన వారం వ్యవధిలోనే దాదాపు రూ.70 లక్షల విలువ చేసే 25 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల లభ్యం కావడంతో నకిలీ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
వందో, రెండొందలో తక్కువకు ఇస్తామని నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే వారి మాయమాటలకు రైతులు మోసపోవద్దు. లైసెన్స్ లేని వారి వద్ద కొనుగోలు చేసి నష్టపోతే పరిహారం పొందే అవకాశం ఉండదు. ప్రభుత్వం సూచించే బ్రాండ్లను కొనుగోలు చేసి నష్టపోతే పరిహారం ఇప్పించేందుకు మేము సహకరిస్తాం. ఎవరైనా ప్రభుత్వం సూచించిన కంపెనీలు కాకుండా ఇతరత్రా విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, సూర్యాపేట