Command Control Center | హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): హైదరాబా ద్ నగరం నడిబొడ్డున గత ప్రభుత్వ హయాం లో శత్రు దుర్బేధ్యంగా, అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో భద్రత కంట్రో ల్ తప్పింది. నిన్న మొన్నటి వరకూ రాజకీయ సమీక్షలకు అడ్డాగా మారిన ఈ ప్రతిష్టాత్మక పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో నకిలీ పోలీసులు తిరుగుతూ భద్రతకు సవాల్ విసురుతున్నారు.
తాజాగా ఐసీసీసీలో టాస్క్‌ఫోర్స్ పోలీసునంటూ బయట చెప్పుకుంటున్న హరిజన గోవర్ధన్ అనే వ్యక్తి.. ఓ బాధితుడి నుంచి రూ.2.8 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఉదంతం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు గోవర్ధన్ గురించి ఆరా తీసి.. అతను టాస్క్‌ఫోర్స్ పోలీ సు కాదని తేల్చారు. దీంతో ఒక్కసారిగా ఐసీసీసీలో భద్రతా వైఫల్యం బట్టబయలైంది.
ఇటీవల సచివాలయంలో వివిధ శాఖల ఉద్యోగులమంటూ నకిలీ ఐడీ కార్డులు సృష్టించుకుని కొందరు కలకలం సృష్టించిన ఘటనను మరువకముందే నేడు ఏకంగా ఐసీసీసీలో నకిలీ పోలీస్ తిరుగుతుండటం చర్చనీయాంశమైం ది. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరుపరచగా.. కోర్టు జ్యుడిషియల్ రి మాండ్‌కు విధించింది. ఈ ఘటన 2024 ఆగస్టులో జరగగా.. ఈ నెల 16న కేసు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కాసాపురం గ్రామానికి చెందిన హరిజన్ గోవర్ధన్ కూకట్‌పల్లిలో మిల్క్ డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నాడు. అతను 2009 నుంచి 2014 వరకు ఫైర్ డిపార్ట్మెంట్లో హోమ్‌గార్డ్‌గా పనిచేశాడు. కూకట్‌పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జ్ఞానసాయిప్రదీప్ పరిచయం అయ్యాడు. తాను ఐసీసీసీలోని టాస్క్‌ఫోర్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానని జ్ఞానసాయిప్రదీప్కు చెప్పాడు. హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని బాధితుడిని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన ప్రదీప్ రూ.2,82,725 నకిలీ పోలీస్‌కు ము ట్టజెప్పారు. వాస్తవానికి ఈ వ్యవహారం నిరు డు ఆగస్ట్ ముందే ప్రారంభమైంది. జనవరి 25న ఐసీసీసీలోకి వెళ్లి బాధితుడు ఆరా తీయ గా గోవర్ధన్ విషయం బయటపడింది. దీంతో మోసపోయానని గ్రహించి బంజారాహిల్స్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.
ఇటీవల సెక్రటేరియట్‌లోకి నాలుగుసార్లు నకిలీ ఉద్యోగుల పేరిట గుర్తుతెలియని వ్యక్తు లు వెళ్లిన ఘటనలు మరువకముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐసీసీసీలోకి టాస్‌ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ఓ వ్యక్తి మూడుసార్లు వచ్చి వెళ్లడం భద్రతను ప్రశ్నిస్తున్నది. ఐసీసీసీలోకి ఎవరు వెళ్లాలన్నా చెకింగ్ పాయింట్లో అన్ని వివరాలు నమోదు చేయాలి. గుర్తింపు కార్డు కూడా చూపించాలి. తాము ఎవరిని కలవాలో కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి నకిలీ కానిస్టేబుల్ ఎవరిని కలవడానికి ఐసీసీసీకి వెళ్లాడు? ఎవరిని కలిశాడు? ఏం చెప్పి లోపలికి వెళ్లాడు..? అని నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి. బాధితుడు గత నెలలోనే ఐసీసీసీకి వచ్చి ఎంక్వైరీ చేసినట్టు తెలియడంతో.. ఈ వ్యవహారాన్ని బయటకు రానీయకుండా అప్పుడే నిందితుడిని అదుపులోకి తీసుకొని ఉంటే ఇంత రా ద్ధాంతం జరిగేది కాదంటూ పోలీసు బాసు అధికారులను మందలించినట్టు తెలిసింది.
సచివాలయంలో నిర్వహించే సమీక్షల వివరాలు క్షణాల్లో బయటకు పొకుతుండటంతో సీఎం రేవంత్, మంత్రులు రెగ్యులర్‌గా ఐసీసీసీలో సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇక్కడ నిర్వహించే సమీక్షలు అత్యంత రహస్యంగా ఉంటున్నాయని తెలిసే ఐసీసీసీకి సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారిక సమీక్షలు కాకుండా.. రాజకీయ నేతలతో ఎప్పుడైతే ఐసీసీసీలో సమీక్షలు, స మావేశాలు, రహస్య భేటీలు నిర్వహించడం మొదలుపెట్టారో.. అప్పటి నుంచే భద్రత సన్నగిల్లిందని, కాంగ్రెస్ నాయకుల తాకిడి వల్లనే ఇక్కడికి కూడా నకిలీలు వస్తున్నారని ఓ పోలీసు అధికారి చెప్పారు.