సుబేదారి, మార్చి 5: ప్రముఖ కంపెనీల పేరుతో అన్నదాతలకు నకిలీ పురుగు మందులు విక్రయించి మోసాలకు పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిశోర్‌ఝా నిందితుల వివరాలు వెల్లడించారు.
రెండు రోజుల క్రితం వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో మట్టెవాడ పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన కాట్రగౌడ భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని, పురుగుల మందులను స్వాధీనం చేసుకొని విచారించగా నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్నట్టు అంగీకరించాడు.
భాస్కర్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో మట్టెవాడ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్ చర్లపల్లిలో బేయర్, టాటా, కోర్టెవా మరో నాలుగు ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు తయారు చేస్తున్న గోడౌన్‌పై దాడులు చేశారు. హైదరాబాద్‌కు చెందిన నాగవెంకట రంగారావు, ముద్దంగుల ఆది త్య, పిట్ట నవీన్, మిర్యాలగూడకు చెందిన దూదిమెట్ల శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రముఖ కంపెనీల పేరు తో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్నట్టు నిందితులు అంగీకరించారు. నిందితుల నుంచి రూ.34 లక్షలు విలువ చేసే నకిలీ పురుగుమందులు, రెండు కార్లు, ఐదు సెల్ఫోన్లు, నకిలీ లేబుళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.