Sub-Registrar Jyothi | జీడిమెట్ల, అక్టోబర్ 29: ఖాళీ స్థలానికి సంబంధించిన యజమాని మృతి చెందినట్టు నకిలీపత్రాలు సృష్టించి, ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసులో కుత్బుల్లాపూర్ పూర్వ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జ్యోతిని మేడ్చల్ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆమె నాంపల్లిలోని చిట్స్ అండ్ ఫైనాన్స్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్ వెంకటాద్రినగర్‌లో ఉప్పుగూడ హనుమాన్‌నగర్‌కు చెందిన లెండ్యాల సురేశ్‌కు 200 గజాల ఖాళీ స్థలం ఉన్నది.
అయితే, పద్మజారెడ్డి అనే మహిళా నేత ఆ స్థల యజమాని సురేశ్ 1992లో చనిపోయినట్టు మరణ ధ్రువీకరణపత్రం, నకిలీ పాన్‌కార్డు, ఆధార్‌కార్డులు సృష్టించారు. 2023 ఫిబ్రవరిలో సుభాష్‌నగర్‌కు చెందిన పద్మజారెడ్డి చెల్లెలు నాగిరెడ్డి, కోమల కుమారి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. వీరికి సహకరించిన అప్పటి కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఈ నెల 4న పద్మజారెడ్డితోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.