హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, మే 23 (నమస్తే తెలంగాణ): ‘కొండకు వెంట్రుక వేద్దాం.. వస్తే కొండ, పోతే వెంట్రుకే కదా అనుకున్నారో? ఏమో కానీ, ఏకంగా 107 ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ జీవోలు, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు. ఇదేదో మారుమూల ప్రాంతాల్లో ఉన్న భూములు కూడా కావు. అత్యంత ఖరీదైన హైదరాబాద్ వెస్ట్ సిటీలోనివి. ఏకంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ వాట్సాప్ గ్రూపుల్లో వీటిని ఏకంగా చెలామణిలోకి తెచ్చారు. ఎవరైనా బకరా దొరికితే కోట్లు కొల్లగొట్టాలనుకున్నారు కాబోలు. కాలం కలిసొస్తే భూములను సైతం స్వాధీనం చేసుకోవాలని కూడా చూశారేమో.. కానీ, ఆదిలోనే వ్యూహం బెడిసికొట్టింది. అధికారుల దృష్టికి రావడంతో గండిపేట తహసీల్దార్ ఈ వ్యవహారాలపై రెండు వేర్వేరు ఫిర్యాదులు ఇచ్చి, సమగ్రంగా విచారించాలని పోలీసులను కోరారు.
గండిపేట్ మండలం పుప్పాలగూడలోని సర్వేనంబరు 326 (18.28 ఎకరాలు), 325 (11.23 ఎకరాలు), 339 (8 ఎకరాలు), 304/పి (14.11 ఎకరాలు), 306 (16.03 ఎకరాలు), 307 (20.16 ఎకరాలు), 302 (10.19 ఎకరాలు) మొత్తం 98.0 ఎకరాలకు ఏకంగా నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు. ఇవన్నీ రెవెన్యూ రికార్డుల్లో కస్టోడియన్ భూములు (ఇండియా నుంచి పాకిస్థాన్ వెళ్లిన వారివి)గా అంటే ప్రభుత్వ భూములుగా నమోదై ఉన్నాయి. కానీ, ఆ భూములకు ఏకంగా పాస్ పుస్తకాలనే సృష్టించారు.
విశేషమేమిటంటే? గత నెల 26వ తేదీనే ఆ భూములను కొనుగోలు చేసినట్టుగా పత్రాల్లో చూపించారు. దావోజు శరత్‌బాబు, సత్యనారాయణ సింగ్, రజ్వాన్ షేక్ పేరిట ఈ పాస్ పుస్తకాలు ఉన్నాయి. గత ఏడాది, ఏడాదిన్నరగా వ్యవసాయ భూముల కొనుగోలుకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు రావడమే లేదు. అందుకే తెలివిగా స్పెసిమెన్ కాపీ (నమూనా కాపీ)లను మాత్రమే సృష్టించారు. పైగా భూభారతిలోనూ ఈ పేర్లు నమోదైనట్టుగా ఆన్లైన్ స్క్రీన్షాట్లను తయారుచేశారు.
నకిలీ పత్రాలు సృష్టించిన ఆ భూములను రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసి చెలామణిలోకి తెచ్చారు. అయితే వీటిని చూసిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేయాలని భావించారు. ఆ భూములపై విచారణ నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి వాటిని చూపించి, వాటిని కొనుగోలు చేయవచ్చా? అని విచారించారు. దీంతో తహసీల్దార్ వాటిని పరిశీలించి, ఆన్లైన్లో సరిచూడగా అవి కస్టోడియన్ భూములని తేలింది. నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేస్తున్నారని గుర్తించిన ఆయన ఈ నెల 14వ తేదీన నార్సింగి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 18లో 104.25 ఎకరాల భూమి ఉన్నది. రెవెన్యూ రికార్డుల్లో ఇవి ప్రభుత్వ భూములుగా (పోరంబోకు కంచె, సర్కారీ కంచె) నమోదై ఉన్నాయి. వీటిపైనా కొందరు వ్యక్తులు నకిలీ జీవోలను సృష్టించారు. సర్వేనంబరు 18/2/1లో 1.20 ఎకరాలను కమను నాగేశ్వరరావు పేరిట సక్సేషన్ (వారసత్వంగా బదిలీ)తో పాటు క్రమబద్ధీకరించినట్టుగా జీవో 558ని గత ఏడాది డిసెంబర్ 2న జారీ చేసినట్టుగా నకిలీ జీవోను తయారు చేశారు. ఇందుకు సంబంధించిన క్రమబద్ధీకరణ మొత్తాన్ని భూభారతి పేరిట డీడీలు, వాటి నంబరు, చెల్లించిన మొత్తాన్ని కూడా అందులో పొందుపరిచి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్ పేరిట జీవో జారీ అయినట్టు తయారు చేశారు. ఇందులో రెఫరెన్స్‌లో దరఖాస్తుదారుడి దరఖాస్తు తేదీ, తహసీల్దార్ నివేదిక, జిల్లా కలెక్టర్ నివేదిక, సీసీఎల్ఏ లేఖతోపాటు 2016లో యూఎల్సీ లేఖను కూడా పొందుపరిచారు. ఇలా 18/1/2లో 2.02 ఎకరాలు నిమ్మల రామస్వామి పేరిట అయినట్టు జీవో 553, 18/1/1లో 2.02 ఎకరాలు నిమ్మల రాజేశ్‌గౌడ్ పేరిట అయిన జీవో 555, 18/1/3లో 2.02 ఎకరాలు నిమ్మల వేణుగోపాల్‌గౌడ్ పేరిట అయినట్టు జీవో 554, 18/1/4లో మరో 2.02 ఎకరాలు గారెల మంగ పేరిట అయినట్టు జీవో 552ను సృష్టించారు. వీటిని కూడా రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున చెలామణి చేస్తున్నారు. ఇవి కూడా అధికారుల దృష్టికి రావడంతో గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి శనివారం నార్సింగి పోలీసులకు లిఖితపూర్వకంగా మరో ఫిర్యాదు చేశారు.