హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద పట్టుకున్నది. వారం కిందటే ఓ నకిలీ ఉద్యోగిని అరె స్ట్ చేయగా, తాజాగా మరో నకిలీ ఉద్యోగి పట్టుబడ్డారు. పైగా.. ఇద్దరూ రెవెన్యూ శాఖ ఉద్యోగులుగా ఐడీ కార్డులు సృష్టించుకోవడం గమనార్హం. దీంతో సచివాలయ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఇంకా ఎంతమంది నకిలీ ఉద్యోగులు తిరుగుతున్నారోనని అనుమానాలు వ్య క్తం అవుతున్నాయి. పోలీసులు వివరాల ప్రకారం… గురువారం మధ్యాహ్నం సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. అతడి వివరాలను ఆరా తీయగా సూర్యాపేట జిల్లా, తిప్పర్తి మండల తహసీల్దార్నని, పనిమీద సచివాలయానికి వచ్చానని చెప్పాడు. ఐడీ కార్డు చూపించాలని కోరగా, అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అదుపులోకి తీసుకొని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కార్యాలయానికి తీసుకెళ్లి తనిఖీ చేయగా, కొంపెల్లి అంజయ్య, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తహసీల్దార్‌గా ఉన్న ఐడీకార్డు లభించింది. తిప్పర్తి తహసీల్ కార్యాలయంలో విచారించగా కొంపల్లి అంజయ్య పేరుతో తమ కార్యాలయంలో ఎవరూ పనిచేయడం లేదని తేల్చిచెప్పారు. దీంతో అతడిని నకిలీ ఉద్యోగిగా గుర్తించి సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.
సచివాలయంలో నకిలీ ఉద్యోగి పట్టుబడటం వారం రోజుల్లోనే ఇది రెండోసారి. పైగా ఇద్దరూ రెవెన్యూ శాఖ ఉద్యోగులుగా పేర్కొనడం గమనార్హం. దీంతో సచివాలయ భద్రతపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 30వ తేదీన భాస్కర్ రావు అనే వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఐడీ కార్డు సృష్టించి, కొంత కాలంగా దర్జాగా సచివాలయంలో తిరుగుతున్నట్టు నిర్ధారించారు. అతడు సెటిల్మెంట్లు, బిల్లుల పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని గుర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుబడిన అంజయ్య కూడా ఏమైనా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడా? ఉద్యోగులను ఎవరినైనా మోసం చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారంలోనే ఇద్దరు పట్టుబడటంతో సచివాలయంలో ఇంకా ఎంత మంది నకిలీ ఐడీ కార్డులతో తిరుగుతున్నారు? అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.