హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ):సచివాలయంలో నకిలీ ఉద్యోగులు వరుసగా పట్టుబడుతుండటంతో అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. పట్టుబడుతున్న వారు ఐడీ కార్డులు సైతం తయారు చేసుకోవడంతో భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయి. వేలాది మంది ఉద్యోగులు, సందర్శకులు వచ్చిపోయే చోట నకిలీ ఉద్యోగులను గుర్తించడం ఎలా? అనేది భద్రతా సిబ్బందికి సవాల్‌గా మారింది.
రెండు వారాల కిందట నకిలీ జూనియర్ అసిస్టెంట్, గతవారం నకిలీ తహసీల్దార్ పట్టుబడగా, బుధవారం నకిలీ ఐఏఎస్ అధికారిని పట్టుకున్న సం గతి తెలిసిందే. ఉద్యోగులను నిర్ధారించుకునేందుకు ఐడీ కార్డు తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ఎస్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు వచ్చేలా వ్యవస్థ ఏర్పా టు చేస్తే నకిలీ ఉద్యోగులను గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.