వికారాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతుకు ఏదో రకంగా నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, మద్దతు ధర లేకపోవడంతోపాటు నకిలీ విత్తనాలతో చిత్తవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నకిలీ పత్తి విత్తనాల బారిన పడిన రైతులు పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలనూ చెల్లించలేని దుస్థితి నెలకొన్నది. ముఖ్యంగా పత్తి రైతు విత్తనాలు మొదలుకొని ఆ పంటను విక్రయించే వరకూ మోసపోతున్నాడు. ప్రతిఏటా కర్ణాటక నుంచి జిల్లాకు వందల క్వింటాళ్లలో నకిలీ పత్తి విత్తనాలు అక్రమంగా తరలుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా వానకాలం సమీపిస్తున్న దృష్ట్యా నకిలీ విత్తనాలను జిల్లాకు తరలించే అవకాశాలున్న నేపథ్యంలో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయాలని జిల్లా రైతాంగం కోరుతున్నది.
మరోవైపు జిల్లా లో 2019 నుంచి ఇప్పటివరకు అధికారికంగా 200 క్వింటాళ్ల వరకు నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసినా.. గుట్టుచప్పుడు కాకుండా వందల క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను జిల్లాకు అక్రమంగా తరలిస్తూ అమాయక రైతులకు విక్రయిస్తు నష్టం కలిగిస్తున్నారు. 2019లో 47.97క్వింటాళ్లు, 2020లో 4.07, 2021లో 85.72, 2022లో 24.64, 2023లో 11.45, 2024లో 64, 2025లో 80 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. నకిలీ విత్తనాలు పట్టుబడినప్పుడే తనిఖీల పేరిట హడావుడి చేయడం ఆ తర్వాత పోలీసులు, వ్యవసాయాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
నకిలీ విత్తనాలపై జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టిం ది. జిల్లాలోని ఏ ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాల బారి న పడకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి మండలానికీ ఒక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయడంతోపాటు మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎస్ఐలతో ప్రత్యే క టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టనున్నా రు. అదేవిధంగా నకిలీ విత్తనాలపై జిల్లా రైతాంగానికి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
జిల్లాలో రానున్న వానకాలం లో 2.92 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయ ని జిల్లా వ్యవసాయ శాఖ సాగు ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో వరి 1,42,000 ఎకరాల్లో, కందులు 98,000, మొక్కజొన్న 35,000, పెసలు 10,500, మినుములు 4,000, జొన్నలు 1,260, సోయాబీన్ 2,260, పొద్దుతిరుగుడు 14,500, జీలుగ 16,500 ఎకరాల్లో సాగు అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అలాగే, సరిపడా ఎరువులు, విత్తనాలను అం దుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
పత్తి విత్తనాలకు సంబంధించి 5.84 లక్షల ప్యాకెట్లు అవసరమని, మిగతా విత్తనాలకు సంబంధించి వరి 35,500 క్వింటాళ్లు, కం దులు 5,880 క్వింటాళ్ల విత్తనాలు, మొక్కజొన్న 3,500, పెసలు 1,050 , మినుములు 320, పొద్దుతిరుగుడు 4,350, జీలుగ 2,475, జొన్న 75 క్విం టాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అన్ని కలిపి 88,640 మెట్రిక్ టన్నులు అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అందులో యూరియా 34,675 మెట్రిక్ టన్నులు, డీఏపీ 21,836, కాంప్లెక్స్ ఎరువులు 28,907 , ఎంవోపీ 4382, ఎస్ఎస్పీ 5,781 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని నిర్ణయించారు.
నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాం. మండలానికి ఒక టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తాం. రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి. బీటీ పత్తి విత్తనాలకు ఎలాంటి అనుమతి లేదు. రైతులు వాటిని కొని మోసపోవద్దు. అంతేకాకుండా లైసెన్స్డ్ దుకాణాల్లోనే పత్తి విత్తనాలను కొనాలి. లేబుల్ లేని ప్యాకెట్లను కొనొద్దు. తప్పనిసరిగా రసీదులను తీసుకోవాలి.
– రాజారత్నం, జిల్లా వ్యవసాయాధికారి