బంజారాహిల్స్,మే 12: తనను మోసం చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేయించి రూ.కోటి వసూలు చేయాలని రౌడీషీటర్లకు సుఫారి ఇచ్చిన యువతి ప్లాన్ బెడిసికొట్టింది. ముగ్గురు యువకుల కిడ్నాప్‌కేసులో యువతితో పాటు మరో ఆరుగురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సుహాసన్ తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం జిల్లాకు చెందిన పాయం మౌనిక కొండాపూర్‌లో నివాసం ఉంటూ నర్సుగా పనిచేస్తుంటుంది. ఆమెకు మాదాపూర్‌లో నివాసం ఉంటూ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న నిఖిల్ అనే యువకుడితో పబ్‌లో పరిచయం ఏర్పడింది. వారి మధ్యన పరిచయం ప్రేమగా మారి సుమారు 9 నెలలు ఒకే గదిలో సహజీవనం చేశారు.
కాగా వారిద్దరి మధ్యన అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయారు. దీంతో తనను మోసం చేశాడంటూ మౌనిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడం, నిఖిల్ కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. కాగా నిఖిల్ లైఫ్ైైస్టెల్ లగ్జరీగా ఉండడంతో పాటు అతడికి ఇటీవల కోట్లలో లాభం వచ్చిందని భావించిన మౌనిక అతడి వద్దనుంచి తనకు నష్ట పరిహారం కింద రూ.కోటి ఇప్పించాలని ఖమ్మం జిల్లా కొత్తగూడం ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ కనకం మహేశ్, అతడి సోదరుడు సుధీర్లను సంప్రదించింది.
దీంతో తన గ్యాంగ్‌ను రంగంలోకి దింపి మ్యాటర్ సెటిల్ చేస్తానని హామీ ఇచ్చిన మహేశ్ నెల రోజుల క్రితం మాదాపూర్‌లో మౌనికతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. అంబర్‌పేటకు చెందిన రౌడీషీటర్ అన్వర్ ఖాన్, అల్వాల్‌కు చెందిన దామెర జాన్, దిల్‌షుక్‌నగర్‌కు చెందిన పొల్కంపల్లి నాగరాజు ఈ మీటింగ్‌లో పాల్గొని నిఖిల్‌ను కిడ్నాప్ చేస్తామని హామీ ఇచ్చారు. కిడ్నాప్ చేసిన తర్వాత రూ.కోటి తనకు ఇచ్చి మీకు ఎంతకావాలంటే అంత వసూలు చేసుకోండి అంటూ మౌనిక ఆఫర్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన రౌడీషీటర్ల ముఠా గిద్దలూరుకు చెందిన పాత నేరస్తుడు సుంకరి ప్రసాద్‌రెడ్డి, జవహర్‌నగర్‌కు చెందిన మాలినేని రాజు, బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన చందు అనే వ్యక్తులతో కలిసి స్కెచ్ వేశారు.
తుపాకీ చూపించి కిడ్నాప్..
మౌనిక వేసిన ప్రణాళికను అమలు చేసేందుకు రంగంలోకి దిగిన ముఠా టాస్క్‌ఫోర్స్ అండర్ కవర్ పోలీసులమంటూ గత నెల 10న రాత్రి బంజారాహిల్స్ రోడ్ నం 12లోని కమాన్ సమీపంలో కారులో వెళ్తున్న ఎన్బీటీనగర్కు చెందిన నిఖిల్ స్నేహితుడు సాయి శ్రీకాంత్ కారును అటకాయించిన రౌడీషీటర్ గ్యాంగ్ తమవద్ద తెచ్చుకున్న బొమ్మ తుపాకీలు గురిపెట్టి కిడ్నాప్ చేశారు. సాయి శ్రీకాంత్‌ను కారులో ఎక్కించుకుని అనంతపూర్‌లో స్నేహితుడు మహేశ్‌తో పాటు ఉన్న నిఖిల్‌ను గుర్తించారు. వీరు ముగ్గురిని కారులో తీసుకుచ్చి ఫామ్‌హౌజ్‌లో బంధించి బ్లాక్‌మెయిల్‌కు దిగారు. మౌనికకు రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేయగా తాను కోటీశ్వరుడిని కాదని, తండ్రి కారు డ్రైవర్‌గా పనిచేస్తాడంటూ నిఖిల్ అసలు విషయం చెప్పాడు.
తమకు ఎంతో కొంత ఇవ్వాల్సిందేనని. లేకుంటే ఎన్కౌంటర్ చేస్తామంటూ బెదిరించడంతో రూ.50లక్షలు ఇస్తానని, ముందుగా 20లక్షలు ఇస్తానని చెప్పిన నిఖిల్ తనతో పాటు కుటుంబసభ్యుల వద్దనున్న బంగారాన్ని అమ్మేసి రూ.13లక్షలు ఇచ్చాడు. దీంతో ముగ్గురిని వదిలేశారు. కాగా ఇటీవల మిగిలిన రూ. 37లక్షలు ఇవ్వకపోతే అంతుచూస్తామని రౌడీషీటర్స్ ముఠా ఫోన్ కాల్స్ చేస్తుండడంతో బాధితుడు నిఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఈ కేసులో మౌనికతో పాటు ఆరుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రౌడీషీటర్ మహేశ్‌తో పాటు చందు అనే నిందితుడు పరారీలో ఉన్నారు. నిందితులవద్దనుంచి మూడు బొమ్మ తుపాకీలు, గొడ్డలి, సుత్తె తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిఖిల్ తదితరులను కిడ్నాప్ చేసి రూ.13లక్షలు వసూలు చేసిన విషయాన్ని మౌనికకు చెప్పకుండా వచ్చిన మొత్తాన్ని గ్యాంగ్ సభ్యులు పంచుకోవడం కొసమెరుపు.