మంచిర్యాల, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నది. బీఆర్ఎస్ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకోవడానికి అరాచకాలకు తెగబడుతున్నది. మొదటి, రెండు విడతల్లో ఇదేవిధంగా కుట్రలు చేసిన ఆ పార్టీ మూడో విడతలోనూ అదేస్థాయిలో బరితెగించింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపల్లిలో పోలింగ్ ముగిసిన అనంత రం రెండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్న లెక్కింపు ప్రక్రియ మొదలుకాలేదు. అ ప్పటికే కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థి తమ్ముడు కొన్ని నకిలీ బ్యాలెట్ పేపర్లు లోపలికి తీసుకెళ్లారనే ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ మద్దతునిస్తున్న సర్పంచ్ అభ్యర్థి, ఏజెంట్లను లోపలికి అనుమతించకపోవడం అనుమానాలకు బలం చేకూర్చింది. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలింగ్ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలింగ్ కేంద్రానికి చేరుకొని వారికి మద్దతుగా బైఠాయించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన విరమించారు.
పంచాయతీ ఎన్నికలు మొదలైన నాటినుంచి చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ ఇవే అరాచకాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. జైపూర్ మండలం శెట్పల్లిలో బీఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ను చంపే ప్రయత్నం చేశారని, కిష్టంపేటలో ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవని బెరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్లలో తాము ఇలాంటి దౌర్జన్యపూరిత రాజకీయాలను నియోజకవర్గంలో ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. మంత్రి వివేక్ నీచ రాజకీయాలను ఎదుర్కొంటామని, పార్టీ శ్రేణులను కాపాడుకుంటామని స్పష్టంచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. ఓటర్ల సంఖ్యకు గణనీయంగా పెరుగగా, పోలింగ్ శాతం పెరుగాల్సి ఉన్నది. కానీ తగ్గిపోయింది. 2019 జనవరిలో నాటి బీఆర్ఎస్ సర్కార్ మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. నాడు అత్యధికంగా సగటున 88.26 శాతం పోలింగ్ నమోదైతే, ఇప్పటి ఎన్నికల్లో 85.86 శాతమే నమోదైంది. నాడు జరిగిన చివరి విడత ఎన్నికలో అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 94.99%, కామారెడ్డిలో 94.56%, అత్యల్పంగా మేడ్చల్‌లో 77.70%నమోదైంది. తాజా ఎన్నికల్లో తొలి విడతలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79%, యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.88% పోలింగ్ రికార్డయింది. రెండో విడతలో నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.71%, యాదాద్రిభువనగిరి జిల్లాలో అత్యధికం గా 91.72%, తుది విడతలో నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.45%, యాదాద్రిభువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.56% పోలింగ్ నమోదైంది.