హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కొత్త దుమారం రేపుతున్నది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ(పీఆర్ఆర్డీ)లో వేళ్లూనుకున్న అవినీతిని మళ్లీ తెరపైకి తెస్తున్నది. కొందరు ఏకంగా సీఎం రేవంత్రెడ్డి ఫొటోను డీఆర్ఎస్ యాప్లో అప్లోడ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ చర్యలపై సీరియస్ అయిన సర్కారు రాష్ట్రవ్యాప్తంగా విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో 553 మంది ఫేక్ అటెండెన్స్ రాయుళ్లు ఉన్నట్టు గుర్తించింది.
వీరిలో 24 మందిపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు.. బాధ్యులుగా 47 మంది ఎంపీవోలను గుర్తించి, షోకాజ్ నోటీసులు జారీచేశారు. అయితే, వీరిపై సస్పెన్షన్ వేటు పడకుండా ఉండాలంటే మామూళ్లు ముట్టజెప్పాలని పలువురు డీపీవోలు వేధిస్తున్నట్టు కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల నిర్వహణకు సొంత జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు చేస్తున్నామని, ఇప్పుడు జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)కు ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 12,760 పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శుల్లో కొందరికి అదనపు గ్రామాల బాధ్యతలు అప్పగించారు. కార్యదర్శుల్లో అధికశాతం మంది జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ఉంటూ గ్రామాలకు వచ్చి వెళ్తుంటారు. ప్రతిరోజు తాము విధులు నిర్వర్తించే గ్రామానికి కార్యదర్శులు వెళ్లి ఉదయం 11 గంటల లోపు ఫేస్ రికగ్నేషన్ యాప్లో ఫొటో అప్లోడ్ చేసి హాజరు నమోదు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో సకాలంలో గ్రామాలకు వెళ్లడం వీలుకాని కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేసేవారు. తమపై ఎలాంటి నిఘా లేదని గ్రహించిన కొందరు కార్యదర్శులు విధులకు డుమ్మాలు కొట్టడం అలవాటుగా మార్చుకున్నారు. కొందరు పెట్టిన ఫొటోనే మళ్లీ మళ్లీ పెడుతూ, ఇంకొందరు కార్మికులు ఫొటోలు అప్లోడ్ చేసేవాళ్లు.
మరికొందరు ఏకంగా మల్టీపర్సస్ ఉద్యోగులకు ఫోన్లు ఇచ్చి పాత ఫొటోలతో హాజరు అప్లోడ్ చేసేవారు. ఇలా రకరకాలుగా విధులకు ఎగనామం పెడుతూ, సొంత పనులు చక్కదిద్దుకుంటున్నారు. వారానికి ఒకసారో, రెండుసార్లో గ్రామానికి చుట్టపుచూపుగా వెళ్లి పనులు చక్కదిద్దేవారు అధికశాతం మంది ఉన్నట్టు ప్రభుత్వ విచారణలో తేలినట్టు సమాచారం. కొన్ని మండలాల్లో ఎంపీవోలను గుర్తించి మెమోలు ఇవ్వగా, బంధువులు చనిపోయారనో, ఆరోగ్యం బాగాలేదనో, ఫోన్ రిపేర్లో ఉన్నదనో సంజాయిషీ ఇస్తూ తప్పించుకొనేవారు. ఒకరిద్దరు ఏకంగా సీఎం రేవంత్రెడ్డి ఫొటోనే తమ ఫేక్ అటెండెన్స్కు వాడటం తీవ్ర దుమారం రేపింది.
అన్ని జిల్లాల్లో కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేస్తున్నట్టు అధికారుల విచారణలో బయటపడింది. ఫేక్ హాజరు శాతాలు కొన్ని జిల్లాల్లో అధికంగా ఉండగా, మరికొన్ని జిల్లాల్లో మామూలుగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 70 మంది, నల్లగొండలో 69 మంది, వికారాబాద్లో 63 మంది, సూర్యాపేటలో 48, కామారెడ్డిలో 43, కొత్తగూడెం జిల్లాలో 442 ఇలా.. చెప్పుకుంటే పోతే జాబితా పెద్దగానే ఉన్నది.
వనపర్తి జిల్లాలో ఎనిమిది మంది కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేస్తే అందులో ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. సిద్దిపేట, నల్లగొండ, వికారాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఫేక్ అటెండెన్స్ రాయుళ్లు బయటపడినా వారిపై చర్యలు తీసుకోకపోవడంపై పలువురు కార్యదర్శులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. క్రమశిక్షణ చర్యల కింద సస్పెన్షన్ వేటు పడకుండా ఉండాలంటే ముడుపులు ముట్టజెప్పాలని పలు జిల్లాల డీపీవోలు కార్యదర్శులతో బేరసారాలు, బెదిరింపులు చేస్తున్నట్టు తెలుస్తున్నది.