హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ శుక్రవారం కూడా డ్రామాలాడారు. ఈ సీనియర్ నాయకుడు ఏమీ ఎరుగనివాడిలా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేందుకు ప్రయత్నించారు. శుక్రవారం ఉదయం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని మధువని గార్డెన్స్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించి, మందీమార్బలంతో అక్కడకు చేరుకొన్నారు. విషయం తెలుసుకొన్న ఎన్నికల అధికారులు ఈటల వద్దకు వచ్చి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గుర్తుచేశారు. దీంతో తనకు నియమావళి గురించి తెలియదని, ఒక్క ప్రెస్‌మీట్ పెట్టి వెళ్తానని ఈటల జవాబిచ్చారు. దీనికి ఎన్నికల అధికారులు స్టార్ క్యాంపెయినర్లు ఎవరైనా సరే ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయంలోనే ప్రచారం చేసుకోవాలని స్పష్టంచేశారు.
ఎన్నికల సంఘం ప్రజాప్రతినిధుల ప్రవర్తనా నియమావళి చట్టం-1951 సెక్షన్ 126 ప్రకారం సైలెన్స్ పీరియడ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టకూడదు. గతంలో ఉన్న నియమావళి ప్రచారం పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచే ఇది అమల్లోకి వస్తుంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈ సమయాన్ని 72 గంటలకు పెంచారు. ఇప్పటివరకు ఆరుసార్లు శాసనసభకు పోటీ చేసి, మంత్రిగా కూడా పనిచేసిన ఈటల రాజేందర్‌కు ఈ విషయం తెలియదంటే ఎవరైనా నమ్ముతారా..? ఈటల రాజేందర్ పీఆర్వో ప్రెస్‌మీట్ ఉంటుందనే సమాచారాన్ని అధికారిక వాట్సప్ గ్రూపులోనే పెట్టారు. ఎన్నికల అధికారుల జోక్యంతో అది కుదరలేదు. దీంతో ఆయన హుజూరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్లి ఒక హోటల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రెస్‌మీట్ పెట్టేందుకు మరోసారి ప్రయత్నించారు. అక్కడ కూడా అధికారులు ఒప్పుకోలేదు. సీనియర్ రాజకీయ నాయకుడైన ఈటల రాజేందర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం సరికాదని చెప్పారు. దీంతో టిఫిన్ తినడానికి వచ్చానని ఒకసారి, అక్కడున్న తమ పార్టీ నేతలను కలిసేందుకు వచ్చానని మరోసారి చెప్పుకొచ్చారు.