హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్/జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరుపై నిర్మించిన చెక్‌డ్యామ్.. బాంబులతో పేల్చివేయడం వల్లే ధ్వంసమైందని పౌరసమాజ ప్రతినిధుల నిజానిర్ధారణ కమిటీ తేల్చిచెప్పింది. వరదలతో చెక్‌డ్యామ్ ధ్వంసమైందనే వాదనను తీవ్రంగా ఖండించింది. శుక్రవారం సాగునీటిరంగ నిపుణుడు వీ ప్రకాష్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, అంబేద్కర్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, హెచ్‌సీయూ ప్రొఫెసర్ రాఘవరెడ్డి, ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ ఎస్ఈ దామోదర్‌రెడ్డి, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు విజయానంద్, సీనియర్ జర్నలిస్టులు రవీందర్, బుచ్చన్న, శంకర్‌తో కూడిన నిజ నిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లింది. చెక్‌డ్యామ్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది.
స్థానిక రైతులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించింది. అందుకు సంబంధించి నివేదికను వెల్లడించింది. ఈ సందర్భంగా వీ ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలపైనే సాగింది. అలాంటి నీళ్లను ఒడిసిపట్టేందుకు, తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మానేరు వాగులపై కేసీఆర్ 1,100 చెక్‌డ్యాంలు నిర్మించారు. వేలాది చెరువులను అనుసంధానం చేశారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించారు. అలాంటి చెక్‌డ్యామ్‌ల్లో 2023 వరకు ఏ ఒక్కటీ కూలలేదు. ఇప్పుడే ఎందుకు కూలిపోతున్నయ్? నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. డబ్బుల కోసం.. పదవుల కోసం ఎంతకైనా తెగిస్తారా? తనుగుల చెక్‌డ్యాం మూమ్మాటికీ పేల్చివేతే.. ఇందుకు ఆధారాలున్నయ్.
ఇసుక మాఫియా చేసిందా? ఇంకెవరైనా చేశారా? అనేది ఇరిగేషన్ ఇంజినీర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో తేల్చాలి. చర్యలు తీసుకోవాలి. ఇదే తరహాలో మేడిగడ్డ వద్ద కూడా బ్లాస్ట్ జరిగిందనే అనుమానాలు వస్తున్నాయ్. రెండేండ్లయినా ఎఫ్ఐఆర్పై విచారణ జరుగుతలేదు. త్వరలో అక్కడికీ పోతం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చివేతలు బాధాకరం. దీని వ్యూహ రచనంతా రాష్ట్ర రాజధాని నుంచే జరిగినట్టు తెలుస్తున్నది. ఇవన్నీ ప్రజల ఆస్తులు.. వాటిని రక్షించుకునే బాధ్యత ప్రతి పౌరుడూ తీసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. నిజనిర్ధారణ కమిటీ ఏ రాజకీయ పార్టీకీ అనుబంధం కాదని, వాస్తవాలు తెలుసుకొనేందుకే వచ్చినట్టు చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో చెక్‌డ్యామ్‌ను పేల్చివేసిట్టు ఆధారాలున్నప్పటికీ దుండగులను ఎందుకు అరెస్టు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
తనుగుల చెక్‌డ్యామ్ పేల్చివేత అనైతిక చర్య అని ప్రొఫెసర్ రాఘవరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని, తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించకపోతే మరిన్ని చెక్‌డ్యాంలు కూలిపోయే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ.. ఇది బ్లాస్టింగేనని, చాలా ఏండ్లు ఇంజినీర్‌గా పనిచేసిన అనుభవంతో చెప్తున్నానని పేర్కొన్నారు. చెక్‌డ్యామ్‌లు జాతి సంపద అని, వాటిని పేల్చడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఇసుక మాఫియా బారి నుంచి చెక్‌డ్యామ్‌లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదని చెప్పారు. వచ్చే సీజన్ వరకు నీళ్లిచ్చే విధంగా పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. క్వాలిటీ లోపమైతే రాఘవ కన్స్ట్రక్షన్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. మాజీ వీసీ, ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడుతూ.. చెక్‌డ్యామ్‌ల కూల్చివేత క్షమించరాని నేరమని మండిపడ్డారు. దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. రిటైర్ట్ ఇంజినీర్ రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ సస్యశ్యామలమైందని, ఇలాంటి తరుణంలో చెక్‌డ్యామ్‌ల కూల్చివేత సరికాదని హితవు చెప్పారు.
మిగిలిన చెక్‌డ్యామ్‌ల పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డ్యామ్‌లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనుగుల చెక్‌డ్యామ్‌ను పరిశీలించకుండానే నాణ్యతా లోపం వల్ల కూలిందంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదని సీనియర్ జర్నలిస్టు పిట్టల రవీందర్ పేర్కొన్నారు. 2023లో కాళేశ్వరం.. 2025లో తనుగుల చెక్‌డ్యామ్ ధ్వంసంపై అనేక అనుమానాలున్నాయని సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
చెక్‌డ్యామ్‌ను పేల్చివేసినట్టు ఆధారాలు సహా ఇంజినీర్లు, ప్రజలు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనిని బట్టి మేడిగడ్డను కూడా కూల్చేవేశారా? అనే అనుమానం కలుగుతున్నదని పేర్కొన్నారు. చెక్‌డ్యామ్‌ల కూల్చివేత ఇసుక మాఫియా పనేననే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకొని, ఇసుక కోసం మానేరులో దిగే ప్రతి వాహనాన్ని సీజ్ చేయాలని, కేసులు నమోదు చేయాలని తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు విజయానంద్ డిమాండ్ చేశారు.
చెక్‌డ్యామ్ విధ్వంసం వెనుక అధికారపక్షానికి చెందిన ఇసుక మాఫియానే ఉన్నదని నిజ నిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది.మానేరుపై మొత్తం 737 మీటర్ల పొడవుతో చెక్‌డ్యామ్‌ను నిర్మించారని, అందులో చైనేజీ 173 నుంచి 263 మీటర్ల వరకు సుమారు 90 మీటర్ల చెక్‌డ్యామ్ ధ్వంసమైందని వెల్లడించింది. బాంబులతో పేల్చివేయడం వల్లే చెక్‌డ్యామ్ ధ్వంసమైందని తేల్చింది. నాణ్యతా లోపం, వరదతో కొట్టుకుపోయిందని చేస్తున్న ప్రచారం అబద్ధమన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారాన్ని ఖండించింది.