Cyber Crime | సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి సోషల్ మీడియాలో వీడియోలు చూసే అలవాటు ఉన్నది. ఓ రోజు రాత్రి 11 గంటలకు ఫేస్బుక్లో వీడియోలు చూస్తుండగా రొమాంటిక్ వీడియో ఒకటి కనిపించింది. దానిపై క్లిక్ చేయగానే, కింద సెమీ న్యూడ్ వీడియో ఒకటి లైవ్ స్ట్రీమింగ్ అవుతూ కనిపించింది. వెంటనే క్లిక్ చేశాడు. మరో లింక్ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఇంకో లింక్.. ఇలా నాలుగైదు లింక్స్ తర్వాత ఓ చాటింగ్ లింక్ ఓపెన్ అయింది. ఓ యువతి సెక్స్ చాట్ ప్రారంభించింది. మాటల్లో పెట్టి.. అతడితో దుస్తులు విప్పించి, వికృత చేష్టలు చేయించింది. ఆ తతంగాన్నంతా రికార్డు చేసి, డబ్బులు డిమాండ్ చేసింది. తన క్షణికావేశానికి ఆ వ్యాపారి లక్షల్లో సమర్పించుకోవాల్సి వచ్చింది.
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : పోర్న్ సైట్లను ప్రభుత్వం నిషేధించటంతో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్ యూజర్లే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్నారు. నకిలీ ఐడీలతో ఖాతాలు సృష్టించి, వీడియో సెక్షన్లో పోర్న్ వీడియోలు ప్రసారం చేస్తున్నారు. రాత్రి 9 గంటలు దాటితే చాలు.. కొన్ని లైవ్ వీడియోలతో పాటు పోర్న్ వీడియోలు కూడా ప్రసారం అవుతున్నాయి. తెల్లవారుజాము వరకు నిరంతరాయంగా పోర్న్ వీడియోలు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ గాలం వేస్తున్నారు.
జంతువులతో క్రాస్ పోర్న్ వీడియోలున్నట్టు థంబ్‌నెయిల్స్ పెట్టి వైరస్ ఉన్న లింక్స్ ఓపెన్ చేయిస్తున్నారు. బలహీన క్షణాల్లో వాటిని ఓపెన్ చేస్తే కొత్త విండోలు ఓపెన్ అవుతూనే ఉంటాయి. వాటిని ఓపెన్ చేస్తే ఆ క్షణంలో వాడుతున్న ఫోన్, పీసీ, ఇతర గ్యాడ్జెట్లు స్టక్ అవుతాయి. ఆ సమస్య పరిష్కారం కావాలంటే డాలర్ల రూపంలో డబ్బులు సమర్పించుకోవాలి. నిత్యం ఇలాంటి వీడియోలు చూసేవారికి కొందరు సైబర్ దొంగలు న్యూడ్ వీడియో కాల్స్ చేసి, డబ్బులు వసూలు చేయిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.
#Markzuckerberg అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సైబర్ దొంగలు ఫేస్బుక్ అధినేతకే సవాల్ విసురుతున్నారు. ఫేస్బుక్ ప్రతినిధులు వాటిని డిలీట్ చేయడంతో కొత్త అకౌంట్ల సృష్టిస్తున్నారు. పిల్లలను పెడదోవ పట్టించేందుకు గేమ్ బేస్డ్ గ్రాఫిక్స్‌తో అశ్లీల వీడియోలు ప్రసారం చేస్తున్నారు.
కొత్త లింక్స్ ఓపెన్ చేసేటప్పుడు ‘యూఆర్ఎల్ బాంబింగ్’తో ప్రమాదకరమైన మాల్వేర్ చొప్పిస్తున్నారనే కేసులు మా దగ్గరికి వచ్చాయి. కొన్ని ఆకర్షణీయమైన ఫొటోలు, ఆఫర్లతో కవ్వించి ఆ లింక్స్ ఓపెన్ చేయిస్తూ ఫోన్/సిస్టమ్‌ను పనిచేయకుండా వారి ఆధీనంలోకి తీసుకుంటారు. ఆ సమస్య పరిష్కారం కావాలంటే స్క్రీన్‌పై కనిపించే అమౌంట్‌ను చెల్లించాల్సిందే. అత్యాశకు పోకుండా అవగాహనతో జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తే 1930 నంబర్‌కు కాల్ చేయండి. లేదంటే దగ్గరలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయండి.
– అనిల్ రాచమల్ల, సైబర్ నిపుణుడు