హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘ఇంటర్మీడియేటరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్’.. ఈ నిబంధనలతో కేంద్రం సోషల్ మీడియాను పావులా మార్చేసింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. తదితర సంస్థలన్నీ కేంద్రంలోని బీజేపీ ఏది చెబితే దానికి తల ఆడిస్తాయి. కాదూ, కూడదు అంటే.. దేశవ్యాప్తంగా ఆ సంస్థపై ‘బ్యాన్’ ముద్ర వేస్తుంది కేంద్రం. వాస్తవానికి సోషల్ మీడియా సంస్థలకు భారతదేశం అతి పెద్ద లాభదాయకమైన మార్కెట్. బ్యాన్ విధిస్తే వాటి మార్కెట్‌కు గండి పడుతుంది, లక్షల కోట్ల నష్టాలు వస్తాయి. మాకు ఎందుకీ లొల్లి.. కేంద్రం చెప్పినట్టు చేస్తే వ్యాపారానికి ఇబ్బంది ఉండదు అని సోషల్ మీడియా సంస్థలు కూడా బీజేపీ ఏది చెబితే అదే చేస్తున్నాయి.
నకిలీ ఖాతాలు.. నకిలీ ఫాలోయర్లు
సోషల్‌మీడియా సంస్థలు తమ కనుసన్నల్లో పనిచేస్తుండటంతో ఆయా ప్లాట్‌ఫామ్స్‌పై నకిలీ ఖాతాలు తెరవటం, నకిలీ ఫాలోయర్స్‌ను పెంచుకోవటమే పనిగా పెట్టుకొన్నది బీజేపీ. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ ఇలా పలు ప్లాట్‌ఫామ్‌లలో బీజేపీ నకిలీ ఖాతాలను సృష్టించి వాటి ద్వారా ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నది. అవి నకిలీవంటూ ప్రత్యర్థులు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం ఉండదు. అంతేకాదండో య్.. ప్రతిపక్ష పార్టీల అసలు ఖాతాలు, ఫాలోయర్లను కూడా తొలగించే స్థాయిలో సోషల్ మీడియా సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకొన్నదా పార్టీ. ట్విట్టర్లో బీజేపీ నుంచి ప్రధాని మోదీకి 60%, అమిత్‌షాకు 67%.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి 32% నకిలీ ఫాలోయర్లు ఉన్నారని గతంలో జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే, అధికార పార్టీకి చెంది న నకిలీ ఫాలోయర్లను ట్విట్టర్ ముట్టుకోదు. ముట్టుకుంటే ఆంక్షలు పడుతాయి కదా. అదే.. రాహుల్‌గాంధీ ఫాలోయర్లను సున్నా చేసిన సందర్భాలూ ఉన్నాయం టే అతిశయోక్తి కాదు.
ప్రత్యర్థుల ఖాతాలూ మాయం
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ట్విట్టర్, ఫేస్బుక్, ఇతర వేదికల ద్వారా విమర్శలు చేసినా, తప్పులు ఎత్తిచూపినా వారి ఖాతాలు తెల్లారేసరికి ఆ సామాజిక మాధ్యమాల్లోంచి మాయం చేస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన రైతుల ధర్నా సమయంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా చాలామంది గళమెత్తారు. దీన్ని తట్టుకోలేక 1,178 ఖాతాలను తొలగించాలని కేంద్రం ఆదేశించటంతో ట్విట్టర్ ఆ ఖాతాలను తొలగించింది. ఇదే పంథాను ట్విట్టర్ ఇప్పటికీ కొనసాగిస్తున్నది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఫాలోయర్స్‌ను ఎక్కడికక్కడ తగ్గించేస్తూ, బీజేపీ నాయకులకు మాత్రం పెంచుతున్నది. గతంలో బీజేపీకి ఫేస్బుక్లో 18 వేల అల్ట్ (నకిలీ ఖాతాలు) ఖాతాలుండేవి, ఇటీవల అవి 1.7 లక్షలకు పెరిగాయి. ఈ ఖాతాలతో లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపటానికి వాడుతుంది. 2019 ఎన్నికల కోసం బీజేపీ ఏకంగా ఫేస్‌బుక్‌నే కొనేసింది.
బీజేపీది తప్పు అన్నారో..
ఫేస్బుక్లో బీజేపీకి లక్షలాది నకిలీ ఖాతాలున్నాయి. ఎవరైనా కేంద్రం, బీజేపీ తప్పును ఎత్తి చూపినా, వ్యతిరేకంగా మాట్లాడినా ఆ నకిలీ ఖాతాలతో వారిపై విరుచుకుపడుతుంది. ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేయడం, శాంతిభద్రతల సమస్యలు లేవనెత్తడం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించటానికి ఈ నకిలీ ఖాతాలను ఆ పార్టీ ఉపయోగిస్తున్నది. కేంద్రంలో ఉండే అధికార పార్టీలకు ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియా సంస్థలు అధికారాన్ని కట్టబెట్టేందుకు కృషి చేస్తుందని గతంలో ఫేస్బుక్లో డాటా సైంటిస్ట్‌గా పనిచేసిన సోఫాయ్ జంగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఫేస్బుక్లో బీజేపీకి అత్యధికంగా నకిలీ ఖాతాలు ఉన్నాయని, వాటి ద్వారా ప్రతిపక్ష పార్టీలపై దాడి చేస్తుందన్న విషయాన్ని కూడా ఆమె జాతీయ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
సోషల్ మీడియాలో మిమ్మల్ని
ఎవరైనా తిట్టారా? సదరు వ్యక్తిపై మీరు ఆయా సంస్థలకు ఫిర్యాదు చేసినా స్పందన లేదా? అయితే, కచ్చితంగా అవతలి వ్యక్తి బీజేపీకి చెందినవాడే అయ్యుంటాడు..! ఆ పార్టీ అయితే చర్యలు తీసుకోరా? అంటే.. అస్సలు తీసుకోరు. బీజేపీకి, సోషల్ మీడియాకు సంబంధమేంటని అనుకొంటున్నారా? ఒకరిది అధికారం.. మరొకరిది వ్యాపారం మరి.
ఉదాహరణలు ఇవే..
1.స్వాతి చతుర్వేది.. ఈమె ఇంగ్లిష్ జర్నలిస్టు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను నిలదీశారు. అంతే.. కొందరు సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్‌తో ఆమెపై అభ్యంతరక పోస్టులు పెట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. కానీ, దర్యాప్తు సంస్థలకు సదరు సంస్థ వివరాలు ఇవ్వలేదు.
2.కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఫాలోయర్లను ట్విట్టర్ అమాంతం తగ్గించేసింది. ఇదేంటని అడిగితే స్పామ్ ఖాతాలను తొలగిస్తున్నామని బదులిచ్చింది. బీజేపీ నేతల ఫాలోయర్లు పెరిగితే, ప్రతిపక్ష పార్టీల నేతల ఫాలోయర్ల తగ్గుతారా? అని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. దానికి ట్విట్టర్..‘ప్రోగ్రామ్ అంతా ఒకే రకంగా పనిచేస్తుంది. ఒకే రకమైన అల్గారిథమ్స్ ఉంటాయి’ అని చెప్పి అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది.