హైదరాబాద్, నవంబర్ 7(నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా 1-ఈ రేస్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి తెలిపారు. ఆ పోటీల అనంతరం రాష్ర్టానికి రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రపంచంలో టాప్-25 నగరాల్లో హైదరాబాద్‌ను ఆ పోటీలు నిలిపాయని గురువారం ఎక్స్ వేదికగా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ప్రజలకు పూర్తి అవగాహన కలిగిందని తెలిపారు. అంటే పెట్టుబడులు తేవడమే పాపమా? ఇందులో తప్పేమిటి? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం అధికారికంగానే రూ.50 కోట్లను ఎఫ్ఐఏకు బదిలీ చేసిందని తెలిపారు. ఫార్ములా ఈ రేస్ పోటీలను క్రికెట్ యోధుడు సచిన్ టెండూల్కర్ సహా అనేకమంది వ్యాపార దిగ్గజాలు, ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది తిలకించారని తెలిపారు. 150 దేశాల్లో ఈ పోటీలు ప్రసారమయ్యాయని గుర్తుచేశారు. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో ఏదో తప్పు జరిగినట్టు చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పాలనా వైఫల్యాల నుంచి దృష్టిని మరల్చేందుకే ఇలా దుష్ప్రచారం చేస్తూ, కేటీఆర్‌ను అరెస్ట్ అంటూ డ్రామాలు ఆడటం దుర్మార్గమని పేర్కొన్నారు.