యాదగిరిగుట్ట,యాదాద్రి భువనగిరి : కేంద్రం అవలంభిస్తున్న వైఖరి వల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) ఆరోపించారు. ముల్కంపల్లి స్టేజీ నుంచి గొల్లగూడెం వరకు రూ. 3 . 37 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్లకు , మల్కాపురం నుంచి పొట్టిమర్రితండ వరకు 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ పీఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
గిరిజన సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ధ్యేయమని అన్నారు.ప్రతి గిరిజన తండా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు.బీజేపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని, బీఆర్ఎస్ పార్టీ చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు.
జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు (Reservations)కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా మూలకు పడేసిందని దుయ్యబట్టారు. దేశంలో బీఆర్ఎస్ (BRS)పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని వెల్లడించారు. బీజేపీ నాయకులు గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్(KCR) గిరిజన రిజర్వేషన్ల నుంచి పది శాతానికి పెంచి గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత, టీస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ట్రైకర్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.