TG Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొథా ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. మొంథా తుఫాను గడిచిన 6 గంటలుగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నదని.. ప్రస్తుతం ఏపీలోని మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పింది.
ఈ రాత్రికి కాకినాడ తీరంలో తుపాను తీరం దాటే ఛాన్స్ ఉందని.. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల ప్రపంచవేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మూడు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
బుధవారం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. గడిచిన 24గంటల్లో ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండతో పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ చెప్పింది.