హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వహణలో రేవంత్‌రెడ్డి సర్కారు ఫెయిలయ్యింది. డీఎస్సీ ప్రశ్నపత్రాల్లో అనేక తప్పులు దొర్లడమే ఇందుకు నిదర్శనం. జూలై 18న నిర్వహించిన ఎస్ఏ (సోషల్)మొదటి షిప్ట్‌లో ఒక ప్రశ్నకు ఆన్సర్ తప్పుగా ఉండగా, మూడు ప్రశ్నలకు ఇచ్చిన రెండు ఆప్షన్లను సరైన సమాధానంగా ప్రకటించారు. జూలై 30న ఎస్ఏ(సోషల్)మొదటి షిప్ట్ పరీక్షలో ఏకంగా 8 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చారు. వారికి నాలుగు మార్కులు అదనంగా కలుస్తాయి. ఇక మరో ప్రశ్నకు రెండు ఆప్షన్లు సరైనవిగా ప్రకటించారు. వీరికి కూడా మార్కులు కలవనున్నాయి. కాగా, డీఎస్సీ పైనల్ కీ, రెస్పాన్స్షీట్లను విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. వారం, పది రోజుల్లో డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నది.
గురుకులంలో విద్యార్థుల వీరంగం ; బ్యాట్లతో కొట్టుకున్న వైనం
ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 6: రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు ఇనుప పైపులు, క్రికెట్ బ్యాట్లతో కొట్టుకున్న ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో గురువారం రాత్రి చోటు చేసుకున్నది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థి చెడు వ్యసనాలకు లోనవ్వగా గమనించిన మరో విద్యార్థి ప్రిన్సిపాల్ నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదు చేసిన విద్యార్థిపై మరో విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. హిందీ అధ్యాపకుడు గురువారం రాత్రి గంటపాటు డ్యూటీలో ఉండి ఇంటికి వెళ్లిపోగా ఇదే అదనుగా భావించిన విద్యార్థుల బృందం అర్ధరాత్రి హాస్టల్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ గాయపడిన వారిని ఎల్లారెడ్డి దవాఖానకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ మహేందర్, సీఐ రవీందర్‌నాయక్, జోనల్ అధికారి ఫ్లోరెన్స్ రాణి ఘటనపై విచారణ చేపట్టారు.