దేవరుప్పుల, ఏప్రిల్ 15 : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ అండ్ హెల్త్ వింగ్ జనగామ శాఖ ఆర్ఎంపీల వద్ద వసూళ్ల దందాకు పాల్పడి అడ్డంగా దొరికింది. టీపీసీసీ జనగామ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ వింగ్ చైర్మన్ ఎడెల్లి సంతోశ్‌కుమార్ జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో మెడికల్ అండ్ హెల్త్ వింగ్‌ను ఏర్పాటుచేసి గ్రామీణ వైద్యుల మీద దాడులు నిర్వహించే కార్యక్రమం చేపట్టారు. ఆర్ఎంపీలు వైద్యం చేయడానికి వీలులేదని బెదిరించి డబ్బులు వసూలు చేపట్టా రు. జిల్లాల్లో ఇప్పటికే లక్షలాది రూపాయలు వ సూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాము టీఎంసీ, ఎన్ఎంసీ సభ్యులమని, గ్రామీణ వైద్యులు వైద్యం చేయడానికి వీలులేదని, ప్రభుత్వపరంగా కఠిన చర్యలు ఉంటాయని, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది.
మూడు రోజుల క్రితం దేవరుప్పుల మండలంలో ఆర్ఎంపీలపై దాడులు చేస్తున్న సందర్భంగా ఈ ముఠా గుట్టురట్టయింది. ఈ ముఠాలో జిల్లా చైర్మన్ ఎడెల్లి సంతోశ్కుమార్తోపాటు జిల్లా వైస్ చైర్మన్ సింగపాక మనోజ్, దేవరుప్పుల మండలానికి చెందిన సంగి నాగరాజు, ఉప్పుల అనిల్, బచ్చన్నపేట మండలానికి చెందిన రంగు భానుచందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామకు చెందిన కందుకూరి హరీశ్ పరారీలో ఉన్నారు. వీరంతా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పీసీసీ మెడికల్ హెల్త్ వింగ్ రాష్ట్ర చైర్మన్ ఎంబీబీఎస్ రాజీవ్ ఆదరాబాదరా జిల్లా చైర్మన్ ఎడెల్లి సంతోశ్‌కుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.