హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో ఐజీ ర్యాంకు అధికారి వీ కమలాసన్‌రెడ్డి పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎక్సైజ్‌శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన పదవీ కాలం నేటి (బుధవారం)తో ముగియనున్నది. ఆయన ఆధ్వర్యంలో పటిష్ఠంగా మారిన ఎన్ఫోర్స్మెంట్ టీమ్.. పోలీసుశాఖకు దీటుగా డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కృషి చేస్తున్నది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ర్టేషన్‌కు డైరెక్టర్‌గా మెడికల్ షాపుల్లో నకిలీ మందులను కనుగొని అక్రమార్కులపై కొరడా ఝుళిపించడంలో కూడా కీలకంగా వ్యవహరించారని పేరుంది. దీంతో ఆయన సేవలను మరింతగా వాడుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ పోలీసుశాఖకు విశేష సేవలందించిన మరో ఐజీ ర్యాంకు అధికారి సత్యనారాయణ కూడా జూన్ 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన సర్వీస్‌ను కూడా ప్రభుత్వం పెంచే అవకాశమున్నట్టు తెలిసింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహాం పదవీ కాలాన్ని కూడా పొడిగిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన పదవీకాలం పొడిగించకపోతే సీనియార్టీ ప్రకారం ఆదిలాబాద్ డిపో మేనేజర్ అశోక్ ఆ స్థానానికి వచ్చే అవకాశం ఉంది.