హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో నేరుగా జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దన్న ప్రభుత్వ నిబంధన అమలును నిలిపివేస్తూ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. గత వారం జారీచేసిన మధ్యంతర ఆదేశాలను పొడిగిస్తున్నట్టు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి సోమవారం ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల జీవోలోని నిబంధనలను సవాలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో అందుకు అనుమతించారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ప్రభుత్వం జారీచేసిన జీవో-7లోని 5వ పేరా 12వ నిబంధనను సవాలు చేస్తూ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు దాఖలు చేసిన వ్యాజ్యాలను సోమవారం న్యాయమూర్తి మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ రాహుల్‌రెడ్డి కల్పించుకుంటూ కౌంటరు దాఖలుకు సమయం కావాలని కోరారు. ఇప్పటికే పలు కాలేజీలకు టోకెన్లు జారీ అయ్యాయని, వాటితోపాటు సంబంధిత సంక్షేమశాఖల ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ విధానం కింద చెల్లింపులు కొనసాగుతాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన కారణంగా పాత బకాయిలపై బాధ్యత విస్మరించబోమని స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ జీవో-7లోని 5వ పేరా 12వ నిబంధన వల్ల కాలేజీలు ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఉండదని అన్నారు. ఈ నిబంధన అమలును నిలిపివేస్తూ గత వారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రస్తుత విద్యాసంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ 24లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు జీవోలోని నిబంధన అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.