మందికి పుట్టిన బిడ్డలను మనబిడ్డలుగా చెప్పుకుంటరని బీజేపీ నేతల తీరుపై కేసీఆర్ అన్నమాట తప్పేమీకాదని మరోసారి రుజువైంది. చట్టసభలంటే లెక్కలేదు.. 140కోట్లమంది చూస్తున్నారన్న బెరుకు లేదు.. ఆన్ రికార్డ్‌గా అసత్యాలు చెప్తే ఏమనుకుంటారోనన్న జంకు లేదు. సకల వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిన కేంద్రంలోని బీజేపీ సర్కారు నిండు పార్లమెంటులో తెలంగాణ స్వీయ స్వేదజలధి కాళేశ్వరంపై అబద్ధాలను వండి వార్చింది. మొన్నటివరకు తెలంగాణ పథకాలను కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపీ కొట్టింది. నిన్నటిదాక.. రాష్ట్రంలో అభివృద్ధి అంతా తమ చలవేనంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందేందుకు శతవిధాలా ప్రయతిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ అసత్యప్రచారమూ హద్దుమీరింది.
పార్లమెంటు సాక్షిగా కేంద్రప్రభుత్వమే పచ్చి బొంకులకు దిగింది. కాళేశ్వరంపై ఎన్నిసార్లు అడిగినా చిల్లిగవ్వయినా విదిలించని కేంద్రం.. ఎంత కోరినా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమని తెగేసి చెప్పిన కేంద్రం.. ఇప్పుడు అడ్డగోలు అబద్ధాలకు దిగింది. రూ.86వేల కోట్ల నిధులు తాము కాళేశ్వరానికి ఇచ్చామంటూ పార్లమెంటులో అధికార పార్టీ ఎంపీ ఆన్ రికార్డు ప్రకటించారు. అయితే 2021 జూలై 22న కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించుకున్నారని లోక్‌సభలోనే ప్రకటించారు. గతేడాది జూలై 31, డిసెంబర్ 15న కూడా కేంద్రం ఇదేమాట స్పష్టంచేసింది. మరి అదే బీజేపీ సర్కారు ఇప్పుడు సోయితప్పి మాట్లాడుతున్నది. తెలంగాణ చెమట చుక్కల కష్టాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు వలువలన్నీ వదిలేసి వ్యవహరిస్తున్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తాను చేపట్టినట్టు ప్రచా రం చేసుకొనే కుట్రలు చేస్తున్నది. చివరకు రాష్ట్రప్రభుత్వం అనేక కష్టలకోర్చి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసా ఇవ్వకుండానే తామే నిర్మించామనే స్థాయికి దిగజారింది. ఏకంగా పార్లమెంటులోనే అడ్డగోలు అబద్ధా లు చెప్పింది. ప్రాజెక్టు కట్టేందుకు రూ.86 వేల కోట్లను తామే ఇచ్చామని పార్లమెంటులో ప్రకటించింది. తామేదో ఉత్తుత్తిగనే చెప్పడంలేదని, సాధికారికంగా చెప్తున్నామంటూ లోక్‌సభలో అధికార పార్టీ ఎంపీ రికార్డుల సాక్షిగా చెప్పారు.
బుధవారం లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధు లు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వలేదని తెలిపారు. నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కూడా కేంద్రం బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. ఇదేనా కేంద్రం అనుసరించే సమాఖ్యస్ఫూర్తి అని నిలదీశారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన జార్ఖండ్ ఎంపీ నిశికాంత్ దూ బే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి మాట్లాడారు. నామా ఆరోపణలు సరికాదని, కేంద్ర ప్రభు త్వం కాళేశ్వరం నిర్మాణానికి రూ.86 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. తాను కేంద్రం తరఫునే ఈ విషయం చెప్తున్నానని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అందుబాటులో లేకపోవడంతో తాను జోక్యం చేసుకొని చెప్తున్నానని వెల్లడించారు. దీంతో దూబే సభకు తప్పుడు సమాచారం ఇస్తూ పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
2021 జూలై 22న లోక్‌సభలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మా ట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించుకున్నారని చెప్పారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా కేంద్రం ఎలాంటి ఆర్థిక సహాయం ఇవ్వలేదని తేల్చిచెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని కూడా స్పష్టంగా చెప్పారు. 2022 జూలై 31న, డిసెంబర్ 15న కూడా షెకావత్ లోక్‌సభలో ఇదే సమాధానం ఇచ్చారు. రుణాలను రాష్ట్ర ప్రభు త్వం సమీకరించుకొని ప్రాజెక్టును నిర్మించుకొన్నదని, ఆర్బీఐ నిబంధనలకు లోబడే ఈ ప్రాజెక్టుకు రుణాలు తీసుకొన్నదని వివరించారు.
తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వాలని, ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని, కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అనేకసార్లు కోరారు. అయినా కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలను సేకరించింది. ప్రభుత్వ ఖాజానా నుంచి కూడా ఖర్చు చేసి రికార్డు సమయంలో ప్రాజెక్టును పూర్తిచేసింది.
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చిందంటూ పార్లమెంట్ వేదికగా బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటని, మరీ ఇంత దారుణమా? అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బీజేపీ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.86 వేల కోట్లు ఇచ్చామని పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రకటన చేయడంపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకొన్న సొంత నిధులతో ప్రాజెక్టును పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
ఒక రూపాయి ఇవ్వకుండా కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులు ఇచ్చిందంటూ చెప్పుకోవడం దారుణమని పేరొన్నారు. ‘ఒకడేమో కాళేశ్వరం ప్రా జెక్టు వల్ల ఒక గుంట తడవలేదు అంటడు. మరొకడు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం అం టడు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాళ్లే సర్టిఫికెట్లు ఇస్తరు. ఇవాళ ఇంకో ఎంపీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు మేమే ఇచ్చామని అంటడు. పాముకు రెండు నాలుకలైతే అబద్ధాల బీజేపీకి మాత్రం పది నాలుకలు’ అని మండిపడ్డారు. బీజేపీ నాయకులది తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే నీచమైన ఆలోచన అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు వస్తే ఓర్చుకోలేక బీజేపీ ఎంపీలు ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు వల్లె వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్లమెంటు సాక్షిగా బీజేపీ అబద్ధాలు చెప్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. నిత్యం అబద్ధాలు చెప్తున్న బీజేపీ నేతలకు సిగ్గుందా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ అబద్ధాలతో రాజకీయం చేయాలనుకొంటున్నదని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.