బచ్చన్నపేట/ యాదగిరిగుట్ట, జనవరి 4 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ లిమిటెడ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో కంపెనీలోని పీఆర్డీసీ భవనం-3లోని ఫెర్రో డివైజ్ ఫిల్లింగ్ అండ్ ప్రెస్సింగ్ భవనంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన కార్మికుడు మార్క కనకయ్య(54) అక్కడిక్కడే మృతి చెందాడు. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
మరో ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. పూర్తి విచారణ అనంతరం వెల్లడిస్తామని పీఈవో కంపెనీ డైరక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. కార్మిక సంఘం నాయకులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. కంపెనీని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సందర్శించారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ చెప్పారు.