హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): టీజీటీ పరీక్ష రాసిన బీఈడీ చదివిన బీటెక్ అభ్యర్థులను పోస్టింగ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ విద్యాసంస్థల నియామక బోర్డు(టీఆర్ఈఐఆర్బీ) చైర్మన్ రోనాల్డ్రాస్ను హైకోర్టు ఆదేశించింది. 2011 వరకు బీఏ, బీఎస్సీ చదివిన వారికి మాత్రమే బీఈడీ రాసేందుకు అవకాశం ఉండగా, ఆ తర్వాత బీకాం చేసిన వారిని కూడా ప్రభుత్వం అనుమతించింది. 2015లో బీటెక్ పూర్తయిన వారు బీఈడీ మ్యాథ్స్, ఫిజిక్స్ చదివేందుకు వీలు కల్పించడంతో పలువురు బీఈడీ పూర్తి చేశారు. టీజీటీలో మెరిట్ సాధించినా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో 2019లో పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. అభ్యర్థుల వినతిని ఆమోదించి వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ దాఖలైన కోర్టు ధికార పిటిషన్లను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనల అనంతరం హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై మార్చి 20న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని రోనాల్డ్రాస్ను ధర్మాసనం ఆదేశించింది.