హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : ‘నేనే విద్యాశాఖ మంత్రిని. విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వను. నా దగ్గరే ఉంచుకుంటా. నేనైతేనే గాడిన పెట్టగలను’ ఎక్కడ ఏ సమావేశం జరిగినా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు ఇవి. కానీ ఆయన నాయకత్వంలోని విద్యాశాఖలోని వివిధ విభాగాల మధ్య పొసగడం లేదు. కోల్డ్‌వార్‌కు దారి తీస్తున్నది. ఒకరు ఉత్తరం అంటే.. మరొకరు దక్షిణం అంటున్నారు. ఒకరు అవునంటే, మరొకరు కాదు అంటున్నారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించడమే లేదు. దీంతో గాడిన పెట్టడం పక్కనపెడితే కొత్త చిక్కులను తెచ్చి పెడుతున్నది. వర్సిటీల్లో రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం జారీచేసిన జీవో-21 ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్రంలోని వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం ఏప్రిల్ 4న సర్కారు జీవో-21ని జారీచేసింది. రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో 2,817 పోస్టులు ఉంటే ప్రస్తుతం 757 (27శాతం) మంది మాత్రమే పనిచేస్తున్నారు. 2,060 (73శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ ఖాళీల భర్తీకి ప్రభుత్వం జీవోను జారీచేసింది. భర్తీకి అకాడమిక్, రీసెర్చ్‌కు 50 శాతం వెయిటేజీ, పీహెచ్డీ ఉంటే 10శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ జీవోలో కొన్ని లోపాలున్నాయని, దీనిపై ఎవరైనా కోర్టుకెళ్తే చెల్లదన్నది నిపుణుల అభిప్రాయం. వాస్తవానికి వర్సిటీల్లో ఆచార్యులను భర్తీ చేయడం ప్రభుత్వానికి ఇష్టంలేదని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ జీవోను ఇచ్చిందన్న వాదనలూ ఉన్నాయి. పోస్టులను భర్తీ చేసే ఉద్దేశం లేకే ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 65 ఏండ్లకు పెంచిందన్న ఆరోపణలు ఉన్నాయి.
వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం తెచ్చిన జీవో మార్పు అంశం విద్యాశాఖలో కోల్డ్‌వార్‌కు దారితీసింది. ఓ దశలో పంచాయితీకి కారణమైంది. ఆ జీవోను సవరించాలని ఉన్నత విద్యామండలి, కొంద రు వర్సిటీల వీసీలు ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే చిక్కులు తప్పవని హెచ్చరించారు. అయితే జీవోను మార్చబోమని, సక్రమంగానే ఉన్నదని ప్రభుత్వం సెలవిచ్చిందట. జీవోను మార్చాలని, ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇబ్బందులొస్తాయని చెప్పినా. సర్కారు వినిపించుకోవడం లేదని తెలిసింది. ఈ జీవో కోర్టులో నిలవబోదని ఉన్నత విద్యామండలి వర్గాలు చెప్ప గా, కోర్టులోనే తేల్చుకుంటామని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించినట్టు సమాచారం. పట్టుదలకు పోవడం, మొండికేయడమంటే కావాలనే చేస్తున్నట్టు అర్ధమవుతుని భావిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం చెల్లని జీవోను ఇచ్చినట్టు స్పష్టమవుతుందని నిరుద్యోగులు అంటున్నారు. దీంతో భర్తీ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.