Telangana Police | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై పోలీసుశాఖ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వారి సమస్యలను పరిష్కరించకపోగా ఆందోళనలు చేస్తున్నవారిపై ఆర్టికల్ 311ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఆందోళనలో పాల్గొన్న బెటాలియన్ కానిస్టేబుళ్లను, వారిని ప్రేరేపించిన వారిని వెంటనే సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ఈ అంశంపై అధికారికంగా ఆదేశాలు బయటికి రాకపోయినప్పటికీ.. ఆందోళనల బాటపట్టిన వారిని తొలగించేందుకు అనధికారిక ఆదేశాలు ఆయా బెటాలియన్ల కమాండెంట్లకు శనివారం రాత్రి అందిన ట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయా బెటాలియన్లలో ఎవరెవరు ఆందోళనలకు దిగారు? వారి కుటుంబసభ్యులు ఎవరు? ఉన్నతాధికారులను ధిక్కరించి మాట్లాడిన వారెవరు? తెలుసుకొనేందుకు బెటాలియన్ల కమాండెంట్లు వివరాలు సేకరిస్తున్నారు.
ఆందోళనల్లో పాల్గొన్న వారి వీడియోలు, ఫొటోలు తీసి ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపినట్టు తెలిసింది. అయితే, ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తం ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆందోళనల్లో పాల్గొన్నవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. సెలవుల విధానంపై పాత పద్ధతినే అనుసరిస్తామని పోలీసుశాఖ చెప్పినా కూడా.. తమ మాట వినకుండా మొత్తం టీజీఎస్పీ వ్యవస్థనే రద్దు చేసేలా పోలీసు కుటుంబాలు ఆందోళనలు చేయడంపై డీజీపీ జితేందర్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.