హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ‘నేర ప్రవృత్తి, హింసాత్మక ప్రవర్తన ఉన్న నవీన్‌యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వవద్దు. ఎమ్మెల్యే వంటి ఉన్నత పదవుల్లో అతను ఉంటే మహిళలకు భద్రత ఉండదు. అతని వంటి హింస, బెదిరింపు, చట్టవిరుద్ధ కార్యకలాపాల చరిత్ర ఉన్న వ్యక్తులను రాజకీయాల్లోకే అనుమతించవద్దు. నవీన్యాదవ్ను తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి’ అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నవీన్‌యాదవ్‌పై అతని సొంత కుటుంబ సభ్యురాలి నుంచి ఈ వ్యాఖ్యలు వ్యక్తమయ్యాయి. ఆయా అంశాలతో కూడిన లేఖను ఏకంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు రాశారు. ఈ నెల 3న మీనాక్షి నటరాజన్‌కు నవీన్‌యాదవ్ సోదరుడి భార్య మహితాశ్రీ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ లేఖ ఆమె రాశారా? లేదా? అనే కోణంలో పలువురు ఆరా తీస్తున్నారు.
వివాహం జరిగినప్పటి నుంచి తన భర్త వెంకట్‌యాదవ్, అతని కుటుంబసభ్యుల నుంచి తాను తీవ్రమైన గృహహింస, వేధింపులను ఎదురొంటున్నానని తన లేఖలో మహితాశ్రీ పేరొన్నారు. దీంతో తాను న్యాయం కోసం పోలీసులు, మహిళా కమిషన్, స్థానిక అధికారులను అనేకసార్లు ఆశ్రయించానని తెలిపారు. ప్రతిసారీ అతని రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తనను అణచివేస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఇంత అన్యాయానికి గురికావడానికి ముఖ్యకారణం తన భర్త సోదరుడైన నవీన్‌యాదవ్ అని, తాను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకొని, చేసే ఫిర్యాదులను పలుకుబడితో అడ్డుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహితాశ్రీ తెలిపారు. నవీన్‌యాదవ్‌కు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ ఇస్తున్నారని తనకు తెలిసిందని, ఈ విషయం తనను మరింత కలచివేసిందని మహితా శ్రీ లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో నవీన్‌యాదవ్ వంటి హింస, బెదిరింపు, చట్టవిరుద్ధ కార్యకలాపాల చరిత్ర ఉన్న వ్యక్తులను రాజకీయాల్లోకి అనుమతించవద్దని ఆమె మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తి చేశారు.
నవీన్‌యాదవ్ వంటి వ్యక్తులు పదవుల్లో ఉంటే సాధారణ పౌరులు, ముఖ్యంగా తమలాంటి మహిళల భద్రతకు మరింత ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. అటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నేర చరిత్ర, హింసాత్మక ప్రవర్తన ఉన్న వ్యక్తులను రాజకీయ అభ్యర్థిత్వానికి పరిగణించొద్దని కోరారు.