SPDCL | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఒక మంత్రి కోసం వేలాది కాంట్రాక్టర్ల పొట్టకొట్టడంతో పాటు సర్కారు ఖజానాకు చిల్లు పడేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ కొన్ని రోజుల కిందటే వెలుగులోకి తెచ్చింది. సదరు మంత్రికి చెందిన ఇన్ఫ్రాకు ఏపీలో వచ్చిన కాంట్రాక్టు రద్దు కావడంతో అప్పటికే ఆ సంస్థ కొనుగోలు చేసిన సబ్స్టేషన్ల మెటీరియల్ అంతా నిరుపయోగంగా మారింది. దానిని వదిలించుకునేందుకు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వ స్తున్న కాంట్రాక్టు విధానాన్ని మార్చి గ్లోబల్ టెండర్ ద్వారా ఆ మంత్రి కంపెనీకి పనులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీంతో వేలాది మంది కాంట్రాక్టర్లు, వారి కింద పనిచేసే కార్మికులు వీధినపడే అవకాశం ఉంది. ఇప్పటికే గత సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో సర్కిళ్ల వారీగా పిలిచిన సుమారు 38కి పైగా పనులకు సంబంధించిన టెండర్లను ఆకస్మాత్తుగా రద్దు చేశారు. ఇలాంటి టెండర్లు దక్షిణ డిస్కం పరిధిలో సు మారు 240 వరకు ఉంటాయి. వాటన్నింటినీ గంపగుత్తగా ఒకే కాంట్రాక్టర్‌కు గ్లోబల్ టెండర్ల విధానం ద్వారా అప్పగించేలా ఉన్నతాధికారు లు హడావుడిగా టెండర్లను సిద్ధం చేస్తున్నారు.
20 శాతం అంచనా పెంచి గ్లోబల్ టెండర్…
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ విద్యుత్ సంస్థల్లో చేపట్టే పనులను సంస్థలో నమోదిత కాంట్రాక్టర్లకు మాత్రమే అప్పగించే సంప్రదాయం ఉంది. దానికి తిలోదకాలు ఇచ్చి గ్లోబల్ టెండర్లకు శ్రీకారం చుట్టారు. వేలాదిమంది విద్యుత్ కాంట్రాక్టర్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా ఓ మంత్రి కంపెనీకి మేలు చేసేందుకే తెరపైకి గ్లోబల్ టెండర్ల అంశాన్ని తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించేలా టెండర్లు పిలిస్తే పోటీపడి 10-15 శాతం తక్కువకే పనులు చేసే కాంట్రాక్టర్లు వందల్లో కాదు వేలల్లో ఉన్నారు. అలాంటి వారిని కాదని 20 శాతం అంచనా వ్యయాన్ని పెంచి ఓ మంత్రి కంపెనీకి అప్పగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 72 సబ్ స్టేషన్ల నిర్మించాల్సి ఉండగా, మిగతా డిస్కం పరిధిలో కలిపి 240కి పైగా సబ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించారు. వీటన్నింటినీ ఒకేసారి గ్లోబల్ టెండర్ల ద్వారా ఒకే కంపెనీకి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో 4500 మంది విద్యుత్ కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇక గ్లోబల్ ఓపెన్ టెండర్ విధానంలో విద్యుత్ శాఖ అధికారులు పార్షియల్(పాక్షికంగా)టర్న్‌కీ విధానాన్ని తీసుకువస్తున్నారు. ఈ విధానం ద్వారా సామగ్రిని డిస్కంకు బదులు కాంట్రాక్టర్లే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారికి డిస్కం నుంచి బిల్లులు అందుతాయి. తద్వారా ఖజనాకు చిల్లు పడడంతో పాటు నాణ్యత లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గతంలో ఇలా..
ఒక సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలంటే ముందుగా దానికి అధికారులు టెండర్లు పిలుస్తారు. పదుల సంఖ్యలో కాంట్రాక్టర్లు పోటీపడితే తమకు కాస్తోకూస్తో గిట్టుబాటయ్యేలా ఒకరు పని దక్కించుకుంటారు. దక్షిణ డిస్కం తమ స్టోర్ నుంచి మెటీరియల్‌ను సరఫరా చేస్తుంది. కాంట్రాక్టర్లు కేవలం వాటిని వినియోగించుకొని సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ఇందులో ఒక్కో కాంట్రాక్టరు కింద కనీసంగా 12-20 మంది వరకు కార్మికులు పని చేస్తారు.
ఈ విధానంతో ప్రయోజనాలు…
కాంట్రాక్టర్ల ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. డిస్కమే మెటీరియల్‌ను కొనుగోలు చేస్తుంది. తద్వారా నాణ్యత పకడ్బందీగా ఉండటంతో పాటు ధర కాస్త తక్కువగా ఉండి, సర్కారు ఖజానాకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రస్తుతం ఇలా..
డిస్కం పరిధిలో ప్రతిపాదించిన అన్ని సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఒకే నోటిఫికేషన్లో టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో మెటీరియల్‌తో సహా అంచనాల వ్యయాలు రూపొందించారు. అంటే కాంట్రాక్టరే మెటీరియల్‌ను సమకూరుస్తాడు.
ఈ విధానంతో నష్టం…
గ్లోబల్ టెండర్లు పిలవడం వల్ల అంచనా వ్యయం రూ.వందల కోట్లలో ఉంటుంది. బడా కంపెనీలు తప్ప చిన్న కాంట్రాక్టర్లు పాల్గొనేందుకు అవకాశమే ఉండదు. తద్వారా వేలాది కాంట్రాక్టర్లకు ఉపాధి పోయి.. వారి కుటుంబాలు ఆర్థిక చిక్కుల్లో పడిపోతాయి.
-మెటీరియల్‌కు అయ్యే మొత్తాన్ని కాంట్రాక్టరుకు డిస్కం చెల్లించాలి. మార్కెట్లో తక్కువ ధరకు కొని ప్రభుత్వం నుంచి మాత్రం ఎక్కువ ధరను కాంట్రాక్టరు పొందుతాడు. నాణ్యతాలోపం ఉంటుంది.
ఉప ముఖ్యమంత్రిని కలిసిన విద్యుత్ కాంట్రాక్టర్లు
గ్లోబల్ టెండర్ల విధానాన్ని అమలు చేయవద్దంటూ టీజీఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గోవర్ధన్‌రెడ్డి, ఎం.ఎన్.రెడ్డి సీఎండీ ముషారఫ్ ఫారూఖీకి పలుమార్లు వినతి పత్రం అందజేశారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవడంతో 20 రోజుల కిత్రం ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను సైతం కలిశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి వారం రోజుల్లో సమాచారం ఇస్తానని ఆయన చెప్పారు. వారాలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదు. మరోవైపు గ్లోబల్ టెండర్లను రూపొందించే పనిలో డిస్కం ఉన్నతాధికారులు ఉన్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ విధానం అమలైతే తమ జీవితాలు రోడ్డున పడినట్టేనని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.