హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థంగా ఎదురొని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు) సేవలను ఓఆర్ఆర్ వరకు విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ విభాగాన్ని మరింత పటిష్ఠ పరుస్తున్నామని, విపత్తులను ఎదురోవడానికి అదనపు సిబ్బందిని, తగు యంత్ర పరికరాలను అందచేయనున్నామని సీఎస్ వివరించారు. ఇప్పటికే, జీహెచ్ఎంసీ పరిధిలో 30 డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని, వీటికి తోడు మరో 15 బృందాలను అదనంగా ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాల్లోనూ డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశాంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.