హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నది. దీనిలో భాగంగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలోని ఖాళీల వివరాలను సేకరించి శాఖలవారీగా క్రోడీకరిస్తున్నది. నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం ఇప్పటికే ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. స్పౌజ్ కేసులు, ఇతర అప్పీళ్ల పరిశీలన కూడా దాదాపు పూర్తికావొచ్చింది. దీంతో జిల్లాల్లో శాఖలవారీగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? వాటిలో పదోన్నతుల ద్వారా భర్తీచేయాల్సినవి ఎన్ని? ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా భర్తీచేయాల్సిన పోస్టులెన్ని? అనే లెక్కలు తీసి ఆర్థికశాఖ ప్రాథమిక నివేదిక రూపొందించినట్టు తెలుస్తున్నది. ఈ నేపధ్యంలో సీఎస్ సోమేశ్‌కుమార్ గురువారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. ఈ సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ఱారావు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ పాల్గొన్నట్టు వినికిడి. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులపై సీఎస్ సమర్పించే నివేదికను సీఎం కేసీఆర్ ఆమోదించగానే వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం.